సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి టీఆర్ఎస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కాంగ్రెస్ నాయకులు ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వస్తున్నారు. తెలంగాణలో పరిస్థితి యథారాజా…తథా ప్రజా అన్న చందంగా ఉందని విజయశాంతి ఆరోపించారు. కేసీఆర్ అరాచకంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకొని దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ దౌర్జన్యాన్ని ఆదర్శంగా తీసుకుని కొందరు దుండగులు ప్రైవేట్ ఆస్పత్రిపై దాడికి పాల్పడ్డారని ఆమె మండిపడ్డారు. అడ్డుకోబోయిన పోలీసులపైనా దాడి చేయడం అమానుషం అని అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రతి విషయాన్నిగమనిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనని జనం వణికిపోతున్నారని విజయశాంతి అన్నారు. ప్రభుత్వ పెద్దలు మేల్కొని ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఆమె డిమాండ్ చేశారు.