తమిళ నటుడు విజయ్‌కాంత్ అంత్యక్రియలకు వెళ్లిన స్టార్ నటుడు దళపతి విజయ్‌కి చేదు అనుభవం ఎదురైంది. ఆయన పైకి ఎవరో చెప్పు విసిరారు. చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. విజయ్ పై చెప్పు విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విజయ్ చుట్టూ ఫ్యాన్స్ గుమిగూడగా.. మధ్యలో నుంచి ఓ చెప్పు వచ్చి అతనికి తగిలినట్లు వీడియోలో కనిపిస్తోంది.
అయితే విజయ్ దానిని పట్టించుకోకుండా కారు ఎక్కడానికి వెళ్లాడు. పక్కనే ఉన్న వ్యక్తి ఆ చెప్పును అది వచ్చిన దిశలోకే విసిరేశాడు. ఈ అంత్యక్రియల్లో విజయ్ ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్న విషయం తెలియలేదు. అయితే అజిత్ ఫ్యాన్స్ క్లబ్ నుంచి ఈ దాడిని ఖండిస్తూ ఒక ప్రకటన మాత్రం విడుదల చేశారు.
“విజయ్ జరిగిన ఈ అవమానాన్ని అజిత్ ఫ్యాన్స్ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా వాళ్లు మన దగ్గరికి వచ్చినప్పుడు గౌరవించాలి. విజయ్ పైకి చెప్పు విసరడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు” అని ఆ ప్రకటనలో అజిత్ ఫ్యాన్స్ విజయ్ కు అండగా నిలిచారు.
గతంలోనూ విజయ్, అజిత్ ఫ్యాన్స్ ఇలా తమ ఐకమత్యాన్ని చాటుకున్నారు. ఫ్యాన్స్ మధ్య వార్ ఎక్కువగా ఉండే తమిళనాడులో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అతని మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తమిళ నటుడు విజయ్‌కాంత్ చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కొవిడ్ బారిన కూడా పడటంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. గురువారం ఉదయం డాక్టర్లు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. విజయ్ కాంత్ కు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సహా ఎంతో మంది ప్రముఖులు నివాళులర్పించారు.