కరోనాపై పోరుకు చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు తవవంతుగా విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. మరికొందరు నేరుగా బాధితులకు సాయం చేశారు. నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఓ నాలుగు వెబ్‌సైట్లు తనకు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని, వారి వార్తల్ని చాలా రోజుల నుంచి గమనిస్తున్నానని టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పరిస్థితిని వివరిస్తూ వీడియోను షేర్ చేశారు.
‘సమాజంలో పక్కన వ్యక్తిని తొక్కి ముందుకు వెళ్లాలి అనుకునేవారు ఉన్నారు. ఎదుటి వ్యక్తి ఏమైపోయినా ఫర్వాలేదు.. నేను బాగుండాలి అనుకుంటారు. వీరు సమాజంలో ఉండటం ప్రమాదకరం. ఈ రోజు వీరి గురించి మాట్లాడాలి అనుకుంటున్నా. కొన్ని వెబ్‌సైట్లు విపరీతంగా వదంతులు రాస్తున్నాయి. వీరి వల్ల చాలా మంది బాధపడుతున్నారు. చిత్ర పరిశ్రమ ఇంకా ఎక్కువ బాధపడుతోంది. మనల్నే వాడి.. మనకు తప్పుడు వార్తలు అమ్మి.. వాళ్లు డబ్బులు చేసుకుంటారు. అయినా సరే ఇన్నాళ్లూ క్షమిస్తూ వచ్చా. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చింది’ అన్నారు.
‘ఈ నాలుగు వెబ్‌సైట్లు గత నెల రోజులుగా నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాయి. విపరీతమైన ఫేక్ వార్తలు రాస్తున్నాయి. ‘విజయ్ దేవరకొండ ఎక్కడ?, విజయ్ దేవరకొండ దాక్కున్నాడా?, విజయ్ దేవరకొండ వేదికపైకి రావాలి?..’ అని రాశారు. వీరికి నా సమాధానం.. అసలు మీరెవరు నన్ను విరాళాలు అడగడానికి. మీరు బతికేదే మా చిత్ర పరిశ్రమపై ఆధారపడి. ప్రకటనలు ఇవ్వకపోతే రేటింగ్స్ తగ్గిస్తామని బెదిరింపులు, ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే మాపై తప్పుడు వార్తలు, మీ అభిప్రాయాలు అందరిపై రుద్దుతారు. నాకు నచ్చినప్పుడు, నాకు అనిపించినప్పుడు, నాకు కుదిరినప్పుడు, నాకు ఎవరికి ఇవ్వాలనిపిస్తే వారికిస్తా.. మీకు కనీసం ఇంత మాత్రం జ్ఞానం లేదా..?’
‘ఏపీ, తెలంగాణలో పేదల కోసం విరాళం సేకరిస్తున్నాం. రూ.25 లక్షలతో ప్రారంభించాం. 2 వేల కుటుంబాల్ని ఆదుకోవాలి అనుకున్నా. కానీ ప్రజలు విపరీతంగా విరాళాలు అందిస్తున్నారు. ఇవాళ రూ.70+ లక్షలు అయ్యింది. మా కార్యకలాపాలు ప్రతి ఒక్కరికీ తెలియాలని వెబ్‌సైట్‌లో లైవ్ అప్‌డేట్స్ ఇస్తున్నాం. అందరికీ సాయం చేసే దిశగా మనం వెళ్తుంటే.. ఆ సదరు వెబ్‌సైట్లు మళ్లీ తప్పుడు వార్తలు రాస్తున్నాయి. నేను సేకరిస్తున్న విరాళాల్లో గందరగోళం జరుగుతోందని, హంగామా చేస్తున్నానని రాశారు. అంతేకాదు చిత్ర పరిశ్రమ నుంచి నేను వేరై, ఈ పని చేస్తున్నట్లు పేర్కొన్నాయి..’ అంటూ విజయ్ గట్టిగా సమాధానం ఇచ్చారు.