యంగ్ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటించిన ‘నోటా’ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అభిమానులను ఉద్దేశించి విజయ్ ఓ ట్వీట్ చేశారు. ‘సంఖ్య పరంగా మనం పెరుగుతున్నాం. మన సొంత నియమ, నిబంధనలను ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. యువకులమైన మనం ఈ మార్పునకు నాంది పలుకుదాం!’ అంటూ అభిమానులకు ఈ సందేశం ఇచ్చారు.
‘మార్పు కోసం మనం ఉన్నాం. అది సినిమాల్లో కావొచ్చు. జీవనశైలిలో కావొచ్చు. మన రౌడీ కల్చర్ లేదా, మన యాటిట్యూడ్‌కు సంబంధించిన మార్పు కూడా కావొచ్చు. సామాజిక మాధ్యమాల వేదిక ద్వారా సానుకూల దృక్పథాన్ని మనం ట్రెండింగ్ చేయాల్సిన సమయం ఇది.’
‘నన్ను అభిమానంగా ప్రేమించే ఎంతోమంది నా ఫొటోను డీపీ(డిస్‌ప్లే పిక్చర్)గా పెట్టుకున్నారు. అయితే, మీలో కొందరి మాటలు కయ్యానికి కాలు దువ్వేలా ఉండటం నేను గమనించాను. నేను అలా ఎప్పటికీ చేయను. దయచేసి మీరు కూడా అలా చేయకండి. కొందరి మాటలు బాధ కలిగించవచ్చు. అయితే, నా పనేదో నాది. మరో విషయం గురించి నేను ఆలోచించను. బతుకుదాం.. బతకనిద్దాం!’
‘ఇప్పటికీ ద్వేషం ఉంటే.. మనం చేయాల్సిందల్లా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మనం సంతోషంగా ఉండేలా ముందుకు సాగడమే. మీరు ఎట్టిపరిస్థితుల్లోనూ నిరాశ చెందవద్దు. మీకు మంచి చిత్రాలను, అద్భుతమైన దుస్తులను మరిన్ని అందిస్తా. ఆన్‌లైన్ వేదికగా దుర్భాషలాడటం మాత్రం చూడాలనుకోవడం లేదు. ఎల్లప్పుడూ ప్రేమతో మీ రౌడీ’ అంటూ ట్వీట్ చేశాడు విజయ్. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విజయ్ నటించిన ‘నోటా’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ సీఎం పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తుంది.