తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది విద్యుల్లేఖ రామన్. గతేడాది తన స్నేహితుడి సంజయ్‌తో నిశ్చితార్థం జరగ్గా, కొన్ని రోజులు కిందట వివాహం కూడా చేసుకుంది విద్యుల్లేఖ. కరోనా కారణంగా బంధువుల, స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. కాగా, ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ ప్రకృతిలో పరవశిస్తున్న ఫొటోలను విద్యుల్లేఖ అభిమానులతో పంచుకుంది.
తాజాగా బికినీలో బీచ్‌లో దిగిన ఫొటో షేర్ చేస్తూ ‘ఏడాదికి రెండుసార్లు ఆరు నెలల పాటు సెలవులు కావాలి’ అని పేర్కొంది. తెలుపు, పసుపు రంగు స్విమ్ సూట్ ధరించి, కళ్లజోడు పెట్టుకుని దిగిన ఫొటోకు కామెంట్స్ వెల్లువెత్తాయి. కొందరు నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. ‘విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు’ అని అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, విద్యుల్లేఖ రామన్ తీవ్రంగా స్పందించారు.
‘‘మహిళలు ఎలా దుస్తులు వేసుకోవాలని నిర్వచిస్తూ కామెంట్స్ చేస్తున్న వారికి ఇదే నా స్పందన. ‘మీ విడాకులు ఎప్పుడు?’ అని కామెంట్స్ రూపంలో సందేశాలు వస్తున్నాయి. నేను స్విమ్ సూట్ వేసుకున్నందుకే ఇలా అడుగుతున్నారా? ఆంటీ, అంకుల్స్ 1920ల నాటి కాలాన్ని వదిలి 2021కు రండి. సమస్య నెగెటివ్ కామెంట్స్ వల్ల కాదు. సమాజం ఆలోచించే తీరును బట్టి ఉంటుంది. ఒక మహిళ వస్త్రధారణే విడాకులకు కారణమైతే సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలందరూ వారి వైవాహిక జీవితాల్లో ఆనందంగా ఉన్నారా? జీవితానికి భద్రత, భరోసానిచ్చే, నీతి, నిజాయతీ, విశ్వాసాలు కలిగిన భర్తను పొందిన నేను అదృష్టవంతురాలిని.
ఇలాంటి కామెంట్స్‌పై స్పందించటం కన్నా వదిలేయమని ఆయన చెప్పారు. అయితే, అది నావల్ల కాలేదు. విమర్శకులారా మీ విషపూరిత ఆలోచనలను నేను మార్చలేను. మీరు సంకుచిత స్వభావులు. జీవితంలో వేగంగా తిరోగమన బాట పడుతున్నారు. మీ జీవితంలో మహిళ అంటే కామవాంఛ తీర్చే సాధనంగా, అణిగి మణిగి, ఎలాంటి అవమానాన్నైనా భరిస్తూ ఉండే వ్యక్తిగా చూస్తున్నప్పుడు ఆమెలోని వ్యక్తిత్వం మీకెక్కడ కనిపిస్తుంది. బతుకు.. బతకనివ్వు’’ అంటూ కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చింది.