ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై స్పందించారు. పాలన ఒక్కచోటు నుంచే ఉండాలనేది తన నిశ్చితాభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్టులో మీడియాతో ఉపరాష్ట్రపతి ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
‘సీఎం, పాలనా యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ ఒక్క చోటే ఉండాలి. అన్ని ఒక్కచోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుంది. అది ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం. నా 42 ఏళ్ల అనుభవంతో ఈ మాట చెబుతున్నా. వివాదం కోసమో, రాజకీయం కోణంలోనో నా అభిప్రాయం చూడవద్దు. కేంద్రం నన్ను అడిగితే నేను ఇదే అభిప్రాయం చెబుతా’
‘అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.. పరిపాలన కేంద్రీకృతం కావాలి. నిన్న రాజధాని రైతులు నా వద్దకు వచ్చారు.. వాళ్ల భావోద్వేగం చూసి నా మనసు చలించింది’ అని వెంకయ్యనాయుడు అన్నారు.