విశ్వశాంతి పిక్చర్స్ అధినేత, ప్రముఖ దర్శకుడు, నిర్మాత విశ్వేశ్వరరావు(92) కరోనా తో మృతి చెందారు. కరోనా సోకడంతో కొన్నిరోజుల క్రితం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగానే ఆరోగ్యం క్షీణించడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. విశ్వేశ్వరరావు సతీమణి రెండేళ్ల క్రితం మరణించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. విశ్వేశ్వరరావు మృతిపై తెలుగు చిత్రసీమ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
ఎన్టీఆర్‌కు స్వయానా వియ్యంకుడైన విశ్వేశ్వరరావు తెలుగు చిత్రసీమకు ఎన్నో విజయవంతమైన సినిమాలు అందించారు. ఎన్టీఆర్ హీరోగా కంచుకోట, నిలువు దోపిడీ, దేశోద్ధారకులు, పెత్తందార్లు వంటి హిట్ చిత్రాలు నిర్మించారు. ఆ తర్వాత దర్శకుడిగా మారి.. తీర్పు, మార్పు, నగ్న సత్యం, కీర్తి కాంత కనకం, పెళ్లిళ్ల చదరంగం చిత్రాలను తెరకెక్కించారు. ఉత్తమ దర్శకుడిగా పలు పురస్కారాలు అందుకున్నారు. రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, రెండు నంది పురస్కారాలు వచ్చాయి. అంతేకాదు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు కూడా ఆయనను వరించింది. దక్షిణ భారత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శిగా పని చేశారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఎండీగా కూడా సేవలు అందించారు.