HomeTelugu Big Storiesనారప్ప రివ్యూ

నారప్ప రివ్యూ

Narappa Review

విక్టరీ వెంకటేష్‌, శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్‌హిట్‌ ‘అసురన్‌’ రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలైన ‘నారప్ప’ తో ప్రేక్షకులను వెంకటేశ్‌ ఏ మేరకు మెప్పించారో చూద్దాం..

కథ: నారప్ప(వెంకటేశ్‌) తన భార్య సుందరమ్మ(ప్రియమణి)తో కలిసి తనకున్న మూడెకరాల పొలం చేసుకుంటూ అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో హాయిగా జీవితం సాగిస్తుంటాడు. అతడికి మునికన్నా(కార్తీక్‌ రత్నం), సిన్నబ్బ(రాఖీ), బుజ్జమ్మ(చిత్ర) ముగ్గురు పిల్లలు. ఆ ఊరి పెద్ద పండు స్వామి(నరేన్‌).. తన తమ్ముడి దొరస్వామి(దీపక్‌ శెట్టి) కోసం ఊళ్లో పేదల భూములన్నీ తీసేసుకుంటాడు. కానీ, నారప్ప తన మూడెకరాల భూమిని మాత్రం ఇవ్వడు. ఈ విషయంలోనే పండు స్వామి, అతని మనుషులతో మునికన్నా గొడవపడి, పండుస్వామిని అవమానిస్తాడు. దీంతో మునికన్నాను దారుణంగా హత్య చేస్తారు. అన్నను చంపారన్న ప్రతీకారంతో పండుస్వామిని సిన్నబ్బ హత్య చేస్తాడు. దీంతో పండుస్వామి కుటుంబ సభ్యులు నారప్ప కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తారు. అప్పుడు నారప్ప ఏం చేశాడు? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి?అనేదే కథ.

నటీనటులు: ‘నారప్ప’ వెంకటేశ్‌ వన్‌మెన్‌ షో అని చెప్పవచ్చు. రెండు వైవిధ్యమైన పాత్రల్లో ఆయన నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్‌ సన్నివేశాల్లో నటుడిగా ఆయన సీనియార్టీ కనిపిస్తుంది. ఇక యాక్షన్‌ సన్నివేశాల్లో వెంకీమామ అదరగొట్టాడనే చెప్పాలి. ప్రియమణి, కార్తీక్‌రత్నం, రాజీవ్‌ కనకాల, రావు రమేశ్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ముఖ్యంగా కార్తీక్‌రత్నం కనిపించేది కొద్దిసేపే అయినా, కథను మలుపు తిప్పే పాత్ర. సాంకేతికంగా సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాకు ప్రధాన బలం మణిశర్మ సంగీతం.

విశ్లేషణ: డబ్బు ఉన్న వాడికీ లేనివాడికి, బలవంతుడికీ బలహీనుడికి మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఎన్నో కథలు వెండితెరను అలరించాయి. బలహీనుడు తిరగబడితే ఎంతటి బలవంతుడైనా మట్టి కరవాల్సిందే. ‘భూమి ఉంటే తీసేసుకుంటారు.. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ, చదువును మాత్రం ఎవ్వరూ తీసుకోలేరు’ అంటూ చదువు ఆవశ్యకతను వివరిస్తూ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా తమిళంలో వచ్చిన ‘అసురన్‌’ ఎంతగానో అలరించింది. అదే కథను వెంకటేశ్‌ కీలక పాత్రలో శ్రీకాంత్‌ అడ్డాల ‘నారప్ప’గా తీయడంలో విజయం సాధించారు. మాతృకలోని ఉన్న ఎమోషన్స్‌ను తెలుగులోనూ కొనసాగిస్తూ సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది.

పోలీసులు, రౌడీల నుంచి నారప్ప కుటుంబం తప్పించుకునే సన్నివేశాలతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు మెల్లిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. పండుస్వామి, నారప్ప కుటుంబాల మధ్య వివాదం జరగడం, పండుస్వామిని చెప్పుతో కొట్టి అమానించడంతో ఇలా ప్రథమార్ధమంతా కాస్త నెమ్మదిగా సాగుతుంది. ఎప్పుడైతే మునికన్నా హత్యకు గురవుతాడో కథలో కాస్త వేగం పెరుగుతుంది. ఆ క్రమంలో వచ్చే ఎమోషనల్‌ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఊహించగులుతున్నా నారప్ప తన చిన్న కొడుకుని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా అనిపిస్తాయి. విరామ సన్నివేశాల్లో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి‌.

ద్వితీయార్ధంలో నారప్ప గతం చెప్పడానికి డైరెక్టర్‌ కాస్త సమయం ఎక్కువ తీసుకున్నాడు. మాతృక ‘అసురన్‌’ను యథావిధిగా ఫాలో అయ్యాడు. నారప్ప యువకుడిగా ఉన్నప్పుడు వచ్చే సన్నివేశాలు, నేపథ్యం ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. అవన్నీ పెద్దగా ఆకట్టుకోవు. అయితే, అటు యువకుడిగా, ముగ్గురు పిల్లలకు తండ్రిగా వెంకటేశ్‌ స్క్రీన్‌పై కనిపించిన తీరు మెప్పిస్తుంది. అయితే, ఫ్లాష్‌ బ్యాక్‌, క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు మాత్రం అలరిస్తాయి. ఇప్పటికే ‘అసురన్‌’ చూసిన వారికి ‘నారప్ప’లో పెద్దగా మార్పులు చేసినట్లు కనిపించవు. దీంతో కథంతా ముందే తెలిసిపోవడం ఈ సినిమాకు కాస్త మైనస్‌.

టైటిల్: నారప్ప
న‌టీన‌టులు: వెంకటేశ్‌, ప్రియమణి, కార్తీక్‌ రత్నం, రావు రమేశ్‌, నాజర్‌, రాజీవ్‌ కనకాల తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: శ్రీకాంత్‌ అడ్డాల
నిర్మాతలు : సురేశ్‌ బాబు, కలైపులి ఎస్‌. థాను
సంగీతం: మణిశర్మ

హైలైట్స్: వెంకటేశ్‌ నటన
డ్రాబ్యాక్స్: నెమ్మదిగా సాగే కథనం

చివరిగా: వెంకీ వన్‌మెన్‌ షో ‘నరప్ప’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu