సీనియర్ హీరో వెంకటేష్ ఈ మధ్య కాలంలో తన స్పీడ్ తగ్గించి వయసుకు తగ్గ పాత్రలను ఎన్నుకుంటూ.. ఏడాదికి ఒకట్రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తున్నాడు. గతేడాది ఆయన నటించిన ‘బాబు బంగారం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు మిశ్రమ స్పందన లభించడంతో ఈసారి ఎలా అయినా పెద్ద హిట్ కొట్టాలని రీమేక్ కథను ఎన్నుకున్నాడు. బాలీవుడ్ లో హిట్ కొట్టిన ‘సాలా ఖడూస్’ ను ‘గురు’ టైటిల్ తో రీమేక్ చేశారు. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసేసుకుంది. జనవరి 26న విడుదల చేయాలని కూడా నిర్ణయించుకుంది. అయితే సడెన్ గా సినిమాను ఏప్రిల్ కు వాయిదా వేసేశారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినప్పటికీ సినిమాను మరో రెండు నెలల పాటు వాయిదా వేయడం ఎవరికి అర్ధం కానీ విషయం. దానికి కారణం వెంకటేష్ అనే మాటలు వినిపిస్తున్నాయి. సినిమా ఔట్ పుట్ విషయంలో వెంకీ సంతృప్తిగా లేడట. కొన్ని సన్నివేశాల్ని మళ్ళీ కొత్తగా రాసి రీషూట్ చేయాలని భావిస్తున్నాడట. అందుకే సినిమాను రెండు నెలల పాటు వాయిదా వేయమన్నట్లు టాక్. మరి అప్పటికైనా సినిమా వస్తుందో.. లేదో..? ఈలోగా వెంకీ, క్రిష్ డైరెక్షన్ లో మరో సినిమా మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదొక థ్రిల్లర్ నేపధ్యంలో సాగే కథ అని సమాచారం.