వాహనదారులతో హైదరాబాద్ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. 45 రోజుల తర్వాత లాక్‌డౌన్ నిబంధనల్లో కాస్త సడలింపు ఇవ్వడంతో ఒకేసారి వాహనాల రద్దీ పెరిగింది. నిర్మాణ రంగానికి సంబంధించిన పలు దుకాణాలు తెరుచుకున్నాయి. ఐటీ ఉద్యోగులు సైతం 33 శాతం వరకు అనుమతి ఉన్నందున కార్యాలయాలకు వెళ్తున్నారు. ఎలక్ట్రికల్, ఫ్లంబర్, సిమెంటు, స్టీల్ దుకాణాలు తెరుచుకోవడంతో వాటిలో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు బయటకు వస్తుండటంతో రోడ్లపై రద్దీ పెరిగింది. దీనికి తోడు మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడంతో రద్దీ మరింత పెరిగింది. మార్చి 22న లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి మొదట్లో రోడ్లపై వాహనాలు చాలా తక్కువగా కనిపించేవి. లాక్‌డౌన్ సడలింపులు ప్రకటించడంతో నెమ్మదిగా వాహనాల రద్దీపెరుగుతోంది. సడలింపులు ఉన్న రంగాలకు చెందిన వారి వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. మిగతా వాహనాలను సీజ్ చేస్తున్నారు.