HomeTelugu Reviews'గని' మూవీ రివ్యూ

‘గని’ మూవీ రివ్యూ

Ghani Movie Review
వరుణ్‌ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. ఈ సినిమాలో తొలిసారి బాక్సర్‌గా తెరపై కనించబోతున్నాడు వరుణ్‌. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఏప్రిల్‌ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.

కథ : గని(వరుణ్‌ తేజ్‌)కి చిన్నప్పటి నుంచి బాక్సింగ్‌ అంటే చాలా ఇష్టం. వాళ్ల నాన్న విక్రమాదిత్య(ఉపేంద్ర) విషయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్‌ వల్ల ‘గని’ బాక్సింగ్‌కు దూరమవుతాడు. దీంతో గనికి తండ్రి మీద విపరీతమైన ద్వేషం ఏర్పడుతుంది. మరోవైపు జీవితంలో ఎప్పుడూ బాక్సింగ్‌ జోలికి వెళ్లొద్దని గని అమ్మ(నదియ) ఒట్టు వేయించుకుంటుంది. గని మాత్రం తల్లికి తెలియకుండా బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొంటూనే ఉంటాడు. ఎప్పటికైనా నేషనల్‌ చాంపియన్‌గా నిలవాలనేదే అతని ఆశయం. అసలు గని బాక్సింగ్‌లో నేషనల్‌ చాంపియన్‌ కావాలని ఎందుకు అనుకుంటున్నాడు? వాళ్ల నాన్న విషయంలో జరిగిన ఆ ఇన్సిడెంట్‌ ఏంటి? తండ్రి గురించి అసలు విషయం తెలుసుకున్న తర్వాత గని ఏం చేశాడు? తన తండ్రికి ఈశ్వర్‌(జగపతి బాబు)చేసిన అన్యాయం ఏంటి? ఈశ్వర్‌ అసలు రూపాన్ని గని ఎలా బయటపెట్టాడు? గని చివరకు నేషనల్‌ చాంపియన్‌గా నిలిచాడా? లేదా? అనేదే మిగతా కథ.

విశ్లేషణ: సాధారణంగా స్పోర్ట్స్‌ డ్రామా సినిమాల్లో జీరోలో ఉన్న ఓ వ్యక్తి హీరో కావడం అన్నట్లుగా కథ ఉంటుంది. ‘గని’ చిత్రంలోనూ ఇదే పాయింట్‌. కానీ ‘గని’ క్యారెక్టర్‌ ఏంటి? అతని ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనే అంశాలను చూపిస్తూ కథను ముందుకు నడిపించాడు దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి. డైరెక్టర్‌ ఎంచుకున్న పాయింట్‌ బాగున్నప్పటికీ.. తెరపై చూపించడంలో తడబడ్డాడు. ఫస్టాఫ్‌ అంతా సాదాసీదాగా నడిపించి, అసలు కథను సెకండాఫ్‌లో చూపించాడు.

ఎలాంటి సర్‌ప్రైజ్‌ లేకుండా ఫస్టాఫ్‌ అంతా చాలా చప్పగా సాగినప్పటికీ.. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ మాత్రం అదిరిపోతుంది. ఉపేంద్ర ప్లాష్‌బ్యాక్‌ సీన్‌తో సెకండాఫ్‌ స్టార్ట్‌ అవుతుంది. అది కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. ఆ తర్వాత కథంతా మళ్లీ రొటీన్‌గానే సాగుతుంది. తండ్రికి అన్యాయం చేసిన ఈశ్వర్‌ ఇండియన్‌ బాక్సింగ్‌ లీగ్‌(ఐబీఎల్‌) నెలకొల్పడం.. ఆ ముసుగులో కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించడం..దానిని గని అరికట్టడంతో కథ ముగుస్తుంది. అయితే ఇక్కడ వచ్చే ప్రతి సీన్‌ గతంలో స్టోర్ట్స్‌ నేపథ్యంలో వచ్చిన చిత్రాలను గుర్తుకు చేస్తాయి. ప్రేక్షకుడి ఊహకి తగ్గట్టుగా కథనం సాగుతుంది. అన్ని స్పోర్ట్స్ డ్రామాల్లో ఎలాంటి క్లైమాక్స్‌ ఉంటుందో, గ‌నిలోనూ అదే ఉంది. కాకపోతే ఎమోషన్‌ మిస్సయిందనిపిస్తుంది. ప్రతి పాత్రకు పేరున్న నటులను తీసుకోవడం సినిమాకు కలిసొచ్చింది.

Varun Tej 1

నటీనటులు : బాక్సర్‌ గనిగా వరుణ్‌ తేజ్‌ మెప్పించాడు. ఈ పాత్ర కోసం వరుణ్‌ పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. రింగ్‌లోకి దిగే నిజమైన బాక్సర్‌లాగే కనిపించాడు. మాయ పాత్రలో సాయీ మంజ్రేక‌ర్ పర్వాలేదనిపించింది. ఆమె పాత్ర నిడివి చాలా తక్కువే అయినా.. ఉన్నంతలో బాగానే నటించింది. ఇక హీరో తండ్రి విక్రమాదిత్యగా ఉపేంద్ర తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించాడు. కథను మలుపు తిప్పే పాత్ర అతనిది. గని కోచ్‌ పాత్రకు సునీల్‌ శెట్టి న్యాయం చేశాడు. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ఈశ్వర్‌ పాత్రలో జగపతిబాబు పరకాయ ప్రవేశం చేశాడు. హీరో తల్లిగా నదియా, బాక్సర్‌గా నవీన్‌చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

ఈ సినిమాకు ప్రధాన బలం తమన్‌ సంగీతం. స్పోర్ట్స్‌ డ్రామా చిత్రంలో ప్రేక్షకుడిని విలీనం చేయడంలో నేపథ్య సంగీతానిది కీలక పాత్ర.. ఆ విషయంలో తమన్‌కి నూటికి నూరు మార్కులు ఇవ్వొచ్చు. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. బాక్సాఫీస్‌పై ‘గని’ పంచ్‌ ఎలా ఉంటుందో ఈ వీకెండ్‌లో తెలిసిపోతుంది.

Varun Tej Ghani Movie Revie

టైటిల్‌ : గని
నటీనటులు : వరుణ్‌ తేజ్‌, సాయి మంజ్రేకర్‌, ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, జగపతి బాబు, నదియ తదితరులు
దర్శకత్వం:  కిరణ్‌ కొర్రపాటి
నిర్మాతలు: అల్లు బాబీ, సిద్దు ముద్ద
సంగీతం : తమన్‌

హైలైట్స్‌‌: వరుణ్‌ తేజ్‌ నటన
డ్రాబ్యాక్స్‌: సెంటిమెంట్‌ అంతగా వర్కౌట్‌ కాలేదు

చివరిగా: ‘గని’ పంచ్‌ తేలిపోయింది
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu