వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పటి వరకు విభిన్న తరహా పాత్రలు పోషిస్తూ, చక్కని నటిగా పేరుతెచ్చుకున్న హీరోయిన్ అప్పుడప్పుడు విలన్ తరహా పాత్రలు కూడా చేసి, మెప్పిస్తూ వుంటుంది. ఇప్పుడు ఈమె డైరెక్టర్గా మారుతున్నట్టు ప్రకటించింది. ‘కన్నామూచి’ అనే తమిళ చిత్రానికి వరలక్ష్మి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపింది. ఇందులో తాను కూడా నటిస్తున్నట్టు ఆమె పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఆఖరికి దర్శకురాలిగా మారాను. చక్కని చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తాను’ అని ఆమె తెలిపింది. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలను,. మహిళలపై దాడులను ఈ చిత్రంలో ఆమె చర్చించనున్నట్టు తెలుస్తోంది. సహా నటులు, చిత్ర ప్రముఖులు ఆమెను శుభాకాంక్షలతో ముంచెత్తారు. వరలక్ష్మిని చూస్తుంటే గర్వంగా, సంతోషంగా ఉందనీ, ఆమె చక్కని చిత్రాన్ని తీసి, సక్సెస్ అవ్వాలని వారంతా తమ ట్వీట్ల ద్వారా ఆకాంక్షించారు.