తమిళ నటుడు విజయకుమార్, మంజుల దంపతుల పెద్ద కూతురు, సినీనటి, బిగ్ బాస్-3 కాంటెస్టెంట్ వనితా విజయకుమార్ ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులు సైతం ఆమె పై వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తోన్న విమర్శలకు సమాధానం చెబుతోన్న ఆమె.. సినీ నటి నయనతార వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రస్తావించింది.
డ్యాన్స్ మాస్టర్, సినీ దర్శకుడు, నటుడు ప్రభుదేవా కూడా గతంలో తన భార్యకు విడాకులు ఇవ్వకుండానే నయన తారతో సహజీవనం చేశాడని ఆమె గుర్తు చేసింది. దీంతో ప్రభుదేవా భార్య రమాలతతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు ఎన్నో కష్టాలు పడ్డారని చెప్పింది. అప్పట్లో ఈ విషయంపై ఒక్క మాట మాట్లాడని వారు, తన మూడో పెళ్లి గురించి మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారని ఆమె ప్రశ్నించింది. దీంతో ఆమెపై నయనతార ఫ్యాన్స్ వనితను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. చివరకు వనిత తన ట్విటర్‌ను డీయాక్టివేట్ చేసేసింది.