ప్రముఖ రచయిత వైరాముత్తు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఓఎన్‌వీ కురుప్ (KURUP) అవార్డును తాను తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. సాహిత్య రంగంలో ఎనలేని సేవలు అందించిన ఓఎన్‌వీ కురుప్ పేరుపై ఆ రంగంలో విశిష్ట సేవలు అందిస్తోన్న రచయితలకు ప్రతిఏటా కేరళ ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటిస్తోంది. ప్రముఖ పాటల రచయిత వైరాముత్తుకు తాజాగా ఈ అవార్డు వరించింది. దీంతో, ఒకానొక సమయంలో మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఇలాంటి వ్యక్తికి ఎంతో విలువైన గౌరవాన్ని ఎలా అందించారు అంటూ పలువురు సినీ ప్రముఖులు, మహిళలు సోషల్‌మీడియా వేదికగా జ్యూరీని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
ఈ నేపథ్యంలో సోషల్‌మీడియాలో తన గురించి విమర్శలు తలెత్తడంతో ఓఎన్‌వీ అవార్డును తాను వెనక్కి ఇచ్చేయదలచుకున్నట్లు వైరాముత్తు తాజాగా ప్రకటించారు. జ్యూరీ ఇబ్బందులు ఎదుర్కొవడం తనకి ఇష్టం లేదని.. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని ఆయన ప్రకటించారు. ఈ మేరకు తాజాగా వైరాముత్తు ఓ వీడియో కూడా విడుదల చేశారు. అలాగే ఓఎన్‌వీ అవార్డుతోపాటు వచ్చిన మూడు లక్షలను.. కరోనా నియంత్రణ కోసం పోరాటం చేస్తున్న కేరళ ప్రభుత్వానికి ఇవ్వాలనుకున్నట్లు ఆయన వెల్లడించారు. మరో రూ.2 లక్షలను కేరళ ప్రభుత్వానికి తన వంతు విరాళంగా ప్రకటించారు.