అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘వచ్చిన వాడు గౌతం’. శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై ఈ సినిమాలో పాలక్ లాల్వాని, విలక్షణ నటుడు నాజర్, కాంతారా ఫేమ్ అచ్యుత్, ఆర్.జె. హేమంత్, సంజ జనక్, మాధవి తదిరులు నటిస్తున్నారు. డీఎస్సార్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా ఎంఆర్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాత దామోదర ప్రసాద్ హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి క్లాప్ కొట్టారు.
సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత అనిల్ సుంకర ఓపెనింగ్ షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకులు ఏ. యస్. రవి కుమార్, వి. సముద్ర, నటుడు రాజా రవీంద్ర లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. జనవరి నుండి రెగ్యులర్ షూట్ మెదలు పెట్టి వైజాగ్, హైదరాబాద్ లలో రెండు షెడ్యూల్స్ లో షూటింగ్ కంప్లీట్ చేస్తామని డీఎస్సార్ చెప్పారు. నటీనటులు, టెక్నీషియన్స్ అందరి సహకారంతో వచ్చే ఏడాది మే నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి హరిహర సంగీతం అందిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ ఫైట్ సీక్వెన్స్ లు సమకూర్చుతున్నారు.