హీరో, నిర్మాత రామ్‌చరణ్ ఆఫీస్ ఎదుట ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు నిరసనకు దిగారు. ఉయ్యాలవాడ సినిమా కథ మొత్తం తీసుకొని తమ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు కనీసం కలవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. ‘ఇటీవల ‘సైరా’ సెట్‌లో అగ్నిప్రమాదం జరిగి కాలిపోయిన వస్తువులన్నీ మావే. అదంతా మా ప్రాపర్టీ. షూటింగ్ కోసమని వాటిని తెచ్చారు. ప్రమాదం జరిగిందని తెలిసి వెంటనే మేము వచ్చాం. అప్పుడు రామ్‌చరణ్‌ను కలిస్తే, చాలా చక్కగా మాట్లాడారు. మా కుటుంబం గురించి, మా పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. సరిగ్గా నెల రోజుల తర్వాత పిలిచి మాట్లాడతానన్నారు. ఈరోజు వస్తే, ‘మీకు మాట్లాడే హక్కు లేదు’ అని ఇక్కడి వాళ్లు అంటున్నారు. చిరంజీవి, రామ్‌చరణ్ మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది.’ అని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా ‘సైరా’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్, జగపతిబాబు, అనుష్క, సుదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేయాలని చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తుంది. అక్టోబరు 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.