కరోనా మహమ్మారిపై పెద్దగా స్పందించని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలిసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే 2 వారాలు అమెరికాకు అత్యంత కీలకమని ట్రంప్ వెల్లడించారు. మరణాల సంఖ్య లక్ష దాటే ప్రమాదం ఉందని వైట్‌హౌస్ హెచ్చరించింది అంటే అమెరికాలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. వారం రోజులుగా అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకూ అమెరికాలో పరిస్థితి చేయిదాటిపోతోంది. అన్ని దేశాలతో పోలిస్తే అమెరికాలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 1.89 లక్షలకు పైగా పెరిగింది. కరోనాకు బలైపోయిన వారి సంఖ్య 3,900కి చేరింది. నిన్న ఒక్కరోజే 700 మంది చనిపోయారు. సెప్టెంబర్ 11 దాడులకంటే కూడా కరోనా మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని అంటున్నారు. ఒక్క మాన్ హటన్‌లోనే 900 మందికి పైగా చనిపోయారు. వచ్చే 2 వారాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.