HomeTelugu Big Storiesఅమెరికాలో 3 వేలకు పైగా మృతులు

అమెరికాలో 3 వేలకు పైగా మృతులు

1 29
అమెరికాలో కరోనా మహమ్మారి బారినపడి మృతిచెందిన వారి సంఖ్య మూడు వేలు దాటింది. సోమవారం ఆ దేశం ఓ చేదు అనుభవాన్నే చవిచూసింది. నిన్న ఒక్కరోజే ఏకంగా 540 మందిమృత్యువాత పడ్డారు. దీంతో వైరస్‌తో పోరాడుతూ మరణించిన వారి సంఖ్య 3017కు పెరిగింది. ఇక వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య 1,63,000లకు చేరింది.

న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారి చికిత్సకు ఆస్పత్రులే కరవయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఓ భారీ నౌకను ఆసుపత్రిగా మార్చింది. సోమవారం హడ్సన్‌ నదిలో ఒడ్డుకు చేరిన ఈ నౌకను రెండు రాష్ట్రాల ప్రజలు నదికిరువైపుల నిలబడి సంతోషంతో స్వాగతం పలికారు. ఇక తీవ్రత ఎక్కువగా ఉన్న మరో రాష్ట్రం కాలిఫోర్నియాలో నాలుగు రోజుల్లో కొవిడ్‌-19తో ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య రెట్టింపయ్యిందని, ఐసీయూలో చేరుతున్న వారి సంఖ్య మూడింతలయ్యిందని గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌ తెలిపారు.

ఇక ఇప్పటి వరకు అమెరికాలో 10లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ప్రతిరోజు దాదాపు లక్ష నమూనాలను పరీక్షిస్తున్నామని ఆరోగ్యశాఖ కార్యదర్శి అలెక్స్‌ అజర్‌ తెలిపారు. మరోవైపు భారత్‌లో ఉన్న అమెరికన్లను తమ సొంతదేశానికి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నామని ట్రంప్‌ పాలకవర్గం తెలిపింది. ఇప్పటి వరకు 50 దేశాల్లో ఉన్న దాదాపు 25 వేల మంది అమెరికన్లను సొంత దేశానికి తీసుకెళ్లామని వెల్లడించింది. వివిధ దేశాల్లో ఉన్న మరో 9 వేల మంది అమెరికాకు వెళ్లడానికి ఆసక్తి వ్యక్తపరచారని పేర్కొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu