రామ్ హీరోగా గతేడాది దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ‘నేను శైలజ’ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దీంతో వీరిద్దరు కలిసి ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ అనే మరో సినిమాను తెరకెక్కించారు. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
అభి(రామ్), వాసు(శ్రీవిష్ణు) ఇద్దరూ కూడా ప్రాణ స్నేహితులు. ఎంతగా అంటే ఒకరికోసం మరొకరు ఏదైనా చేసేంత గొప్ప స్నేహం వాళ్ళది. అయితే ఒకానొక దశలో వీరిద్దరి జీవితాల్లోని మహా(అనుపమ పరమేశ్వరన్) అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది. అభి, వాసు ఇద్దరూ కూడా మహాను ప్రేమిస్తారు. మరి వారిద్దరిలో మహా ఎవరిని ప్రేమిస్తుంది..? ఆమె కారణంగా అభి, వాసు మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయా..? చివరికి వీరి జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయి..? అనే
విషయాలతో సినిమా నడుస్తుంది.
విశ్లేషణ:
స్నేహం, ప్రేమ ఈ రెండు విషయాలను ఒకే తాడుపై నడిపిస్తూ కథను సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు. అయితే కథకు ప్రధాన బలం కేవలం ఎమోషన్స్ మాత్రమే. అభి, మహాల మధ్య వచ్చే సన్నివేశాలను బాగానే చూపించినప్పటికీ అభి, వాసుల మధ్య స్నేహ బంధాన్ని మాత్రం గొప్ప స్థాయిలో ఆవిష్కరించలేకపోయారు. కీలక సన్నివేశాల్లో తప్ప మిగతా సినిమా మొత్తం ఏదో ఉదాసీనంగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది.
దర్శకుడు అనుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ కథనం చాలా బలహీనంగా చాలా రొటీన్ గా ఉండడంతో ఆడియన్స్ కు బాగా బోర్ కొడుతుంది. పైగా సినిమాను మరింత సాగదీసి చూపించడంతో ఆసక్తి తగ్గిపోతుంది. సినిమాలో కొన్ని భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు, రామ్-అనుపమల ట్రాక్, కొన్ని చోట్ల కామెడీ తప్ప చెప్పుకోదగిన స్థాయిలో సినిమా లేదంటే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ బాగానే ఎంటర్టైన్ చేసినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం ఆడియన్స్ కు పరీక్షగా మారింది. క్లైమాక్స్ సన్నివేశాలు ఊహాజనితంగా ఉంటాయి. పైగా హీరో గారు సెకండ్ టైమ్ కూడా చాలా ఈజీగా ప్రేమలో పడిపోతారు. అది కాస్త నిరుత్సాహాన్ని కలిగిస్తుంది.
రామ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అనుపమ తెరపై చాలా అందంగా కనిపించింది. అయితే ఆమె పాత్రను అర్ధాంతరంగా ముగించడం కాస్త నిరాశ పరుస్తుంది. శ్రీవిష్ణు పాత్ర కూడా ఎమోషనల్ గా ఉంటుంది. అయితే ఆ పాత్రలో సరైన భావోధ్వేగాలను పండించలేకపోయాడు. లావణ్య త్రిపాఠి పాత్ర కూడా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. గ్లామరస్ కనిపించాలని అమ్మడు చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. కానీ అది వర్కవుట్ కాలేదు. ప్రియదర్శి, కిరీటి పాత్రలు
నవ్విస్తాయి.
ప్రతి సినిమాలో తన మ్యూజిక్ తో మెప్పించే దేవిశ్రీ ఈ సినిమాకు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు. పెప్పీ సాంగ్ ఒకటి మాత్రమే బాగుంది. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటర్ తన కత్తెరకు మరింత పదును పెట్టాల్సింది. సినిమాలో అనవసరపు సన్నివేశాలు చాలానే ఉన్నాయి. మొత్తం మీద రొటీన్ కథనంతో స్లో అనిపించే సన్నివేశాలతో దర్శకుడు తనపై పెట్టుకున్న అంచనాలను రీచ్ కాలేకపోయారు.
నటీనటులు: రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి, శ్రీవిష్ణు, ప్రియదర్శి తదితరులు
కెమెరా: సమీర్ రెడ్డి
మ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడ్యూసర్లు: కృష్ణ చైతన్య, స్రవంతి కిషోర్
డైరెక్షన్: కిషోర్ తిరుమల
రేటింగ్: 2.5/5