మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ముంబయిలోని నెహ్రూ సెంటర్‌లో జరుగుతున్న సమావేశం ముగిసింది. ఈ చర్చలు ఫలవంతంగా ముగిసినట్లు సమావేశం అనంతరం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. అయితే, ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించేలా అంగీకారం కుదిరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన శనివారం వెలువడనుంది. ఉద్ధవ్ ఠాక్రే కూటమికి నేతృత్వం వహించేలా, ఐదేళ్లపాటు సీఎం పదవిలో కొనసాగేలా ఈ కీలక సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్ధవ్ సీఎంగా ఉండాలని ముందు నుంచి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రతిపాదిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మహారాష్ట్ర తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
మహారాష్ట్రలో వారం రోజుల నుంచి రాష్ట్రపతి పాలన ఉన్న సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించారు. మరోవైపు, తన డిమాండ్ 50:50 ఫార్ములాకు అంగీకరించనందుకు బీజేపీతో శివసేన తమ మూడు దశాబ్దాల నాటి స్నేహాన్ని వదులుకుంది. తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు తమకు మద్దతు ఇవ్వాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గత వారం కాంగ్రెస్, ఎన్సీపీని కోరారు. పార్టీల నాయకుల మధ్య వారం రోజుల పాటు చర్చల తర్వాత కూటమితో ప్రభుత్వ ఏర్పాటు ఓ కొలిక్కి వచ్చింది.