ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ అధినేత యశ్ చోప్రా కుమారుడు ఉదయ్ చోప్రా ట్విటర్‌లో షాకింగ్ ట్వీట్లు చేశారు. ‘ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా పరిస్థితి బాగోలేదు. ప్రయత్నిస్తున్నాను కానీ ఓడిపోతూనే ఉన్నాను. కొన్ని గంటల పాటు నా ట్విటర్‌ను డీయాక్టివేట్ చేశాను. చావుకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది. చెప్పాలంటే ఆత్మహత్య చేసుకోవడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. త్వరలో శాశ్వతంగా వెళ్లిపోతాననిపిస్తోంది’ అని ట్వీట్ చేశారు. దాంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే ఉదయ్ ఇప్పటివరకు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది లేదు. దాంతో ‘వద్దు సర్..దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి’ అంటూ ఆయన్ను సముదాయించేందుకు యత్నించారు. మరో విషయం ఏంటంటే.. ఉదయ్ ఈ ట్వీట్ పెట్టిన కొద్ది నిమిషాల తర్వాతే డిలీట్ చేశారు. కానీ అప్పటికే నెటిజన్లు స్క్రీన్‌షాట్లు తీసేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతేడాది ఉదయ్ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెడుతూ.. ఒత్తిడి, ఒంటరితనంతో బాధపడుతున్నవారిని దగ్గరికి తీసుకుని ఓదార్చాలని, సాయం అడగడంలో ఎలాంటి తప్పులేదని పేర్కొన్నారు. అలాంటి ఆయన ఉన్నట్టుండి ఆత్మహత్య గురించి మాట్లాడడంతో ఈ ట్వీట్లు కాస్తా బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ‘ధూమ్’, ‘ధూమ్ 2’, ‘ప్యార్ ఇంపాజిబుల్’ వంటి చిత్రాల్లో ఉదయ్ నటించారు. కానీ నటుడిగా పేరు తెచ్చుకోలేకపోయారు. చాలా కాలం తర్వాత ఆయన అమెరికా నుంచి ముంబయి వచ్చినప్పుడు బాగా లావైపోయి గుర్తుపట్టలేనట్లుగా కనిపించడం షాక్‌కు గురిచేసింది.