కార్మిక సంఘాల ప్రకటనపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం.. వారిని విధుల్లోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. కార్మికులు పండగ సమయాల్లో అనాలోచితంగా సమ్మె చేసి.. ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారని విమర్శించారు. ఇష్టమొచ్చినప్పుడు సమ్మె చేసి.. ఇప్పుడు వచ్చి విధుల్లో చేరతామంటే కుదరదని అన్నారు. తాత్కాలిక డ్రైవర్లను
అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు డిపోల వద్ద శాంతి భద్రతల సమస్య సృష్టించవద్దని కార్మికులకు సూచించారు. దీంతో ఉదయం 6 గంటల నుంచే అన్ని డిపోల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశం మేరకు కార్మికుల సమ్మెపై కార్మిక శాఖ కమిషనర్ నిర్ణయం తీసుకుంటారని, దాన్ని అనుసరించి ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ వెల్లడించారు. అంతా చట్టబద్ధంగా, పద్ధతి ప్రకారం జరుగుతుంది. అప్పటి వరకు అందరూ సంయమనం పాటించాలని చెప్పారు. హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకూ చట్టవిరుద్ధమైన సమ్మె చేసిన కార్మికులను విధుల్లోకి తీసుకోవడం సాధ్యంకాదని స్పష్టం చేశారు. కార్మికులు ఇప్పటికే యూనియన్ల మాట విని నష్టపోయారు, ఇకపై మరిన్ని నష్టాలు కోరి తెచ్చుకోవద్దని తెలిపారు.