TS MLC By-Elections: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హీట్ చల్లారక ముందే రాష్ట్ర రాజకీయాలను ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేడెక్కిస్తోంది. వరంగల్- ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఈ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అక్కడ పోటీ చేసిన ప్రధాన పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ గతంలో బీజేపీలో ఉన్నవాళ్లే. ప్రస్తుతం ఒకరు బీజేపీ నుండి పోటీ చేయగా, మిగతా ఇద్దరూ గతంలో బీజేపీలో పనిచేసిన నేతలే. ఇప్పుడు ఆ ముగ్గురూ పోటీపడుతున్నారు.
వరంగల్- ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. 2021లో ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవీ కాలం మార్చి 2027 వరకు ఉంది. ఈ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోరు ఆసక్తికరంగా మారింది.
వరంగల్- ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు 52 మంది పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. ఈసారి ఎలాగైనా ఎమ్మెల్సీ తనకు దక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో వ్యవహరిస్తోంది. గత ఎన్నికల్లోనూ బలమైన ఓట్లు సాధించడమే కాకుండా విద్యావంతుల ఆదరణ తమకే ఉందని నిరూపించే సంకల్పంతో బీజేపీ ఈ స్థానంపై కన్నేసింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల విషయంలో ఒక విశేషం ఉంది. ఈ ముగ్గురూ గతంలో బీజేపీలో పనిచేసిన వారే కావడంతో ఆసక్తికరంగా మారింది.
రాజకీయ అవకాశాల కోసం బీజేపీ నుంచి ఇతర పార్టీల్లోకి జంప్ చేసిన నేతలు ఇప్పుడు ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డి మొదటి నుంచి పార్టీలో అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2021లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసి ప్రేమేందర్ రెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి ఆయన తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న కూడా ఒకప్పుడు బీజేపీ నేతగా ఉన్నారు. ప్రజల గొంతుకగా ఉంటానంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేసిన తీన్మార్ మల్లన్న.. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీయే అంటూ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కొద్ది రోజులకే బీజేపీలో సరైన అవకాశాలు, ప్రాధాన్యత లేదని భావించిన మల్లన్న కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. దీంతో ఈ స్థానంలో ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించింది.
బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా గతంలో బీజేపీ నేతగా ఉన్నాడు. రాకేష్ రెడ్డి బీజేపీలో విద్యార్థి నేతగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, అంచలంచెలుగా ఎదిగి పార్టీ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన రాకేష్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. సిట్టింగ్ స్థానం కావడంతో దీన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ బలమైన విద్యార్థి నేతగా పేరున్న రాకేష్‌రెడ్డిని పోటీలో నిలిపింది. సోషల్‌మీడియా, మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం సాగించి పట్టభద్రుల్లో పట్టు సాధించాలని మూడు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.