HomeTelugu Big Storiesఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

10 14ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి విలీన అంశం ప్రధాన ఆటంకంగా ఉందని.. మిగతా అంశాలపై భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. అందుకే మిగతా అంశాలు ముందుగా చర్చించాలని పేర్కొన్నట్లు తెలిపింది. సమ్మె వ్యవహారంపై ఉన్నత న్యాయస్థానంలో ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాల జేఏసీ మధ్య వాదనలు కొనసాగాయి. రాత్రికి రాత్రే సమస్యల్నీ పరిష్కారం కావని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. తమ డిమాండ్లపై ఆర్టీసీ యాజమాన్యం అంగీకరిస్తుందా లేదా అనేది తర్వాత విషయమని.. చర్చించడానికి తప్పేంటని కార్మిక సంఘాల తరఫు న్యాయవాది వాదించారు. ప్రస్తుతానికి విలీనం డిమాండ్‌ను పక్కన పెట్టకపోతే ప్రతిష్టంభన ఇలాగే కొనసాగుతుందని.. ఇరు వర్గాల మధ్య సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈడీల కమిటీ 21 అంశాలను అధ్యయనం చేసి ఆర్టీసీ ఎండీకి నివేదిక ఇచ్చిందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) రామచంద్రరావు కోర్టుకు తెలిపారు. 21 డిమాండ్లలో 16 అంశాలకు డబ్బులు అవసరమని.. ప్రస్తుతానికి ఆర్టీసీకి ఆ స్థాయి ఆర్థిక స్థితి లేదని కమిటీ తెలిపినట్లు ఆయన వివరించారు. మరో రెండు అంశాలకు చాలా నిధులు అవసరమని.. అవి అసాధ్యమని పేర్కొందన్నారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ఈడీల కమిటీ నివేదికను తమకెందుకు సమర్పించలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలు తమ వద్ద కూడా దాచి పెడతారా అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీని ఎందుకు నియమించలేదని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

డిమాండ్లు అంగీకరించడం సాధ్యంకాదని ముందే నిర్ణయించుకుంటే ఎలా? అని హైకోర్టు అదనపు ఏజీని ప్రశ్నించింది. ముందే నిర్ణయించుకుని కార్మికులను చర్చలకు పిలిస్తే లాభమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ”ఆర్టీసీ కార్మికుల కంటే ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. 21 డిమాండ్లలో నాలుగింటి పరిష్కారానికి రూ.46.2కోట్లు అవసరమని నివేదికలో పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ఆర్టీసీకి ప్రభుత్వం రూ.50 కోట్లు ఇవ్వగలదా? రూ.50కోట్లు ఇస్తే ప్రస్తుతానికి సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం” అని హైకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. దీనిపై అదనపు ఏజీ సమాధానమిస్తూ ప్రభుత్వం ఆర్టీసీకి రూ.50కోట్లు ఇవ్వలేదని చెప్పారు. అదనపు ఏజీ సమాధానంపై ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేస్తూ అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)ని పిలవాలని ఆదేశించింది. దీంతో ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. కార్మిక సంఘాల తీరు సరిగాలేదని..రూ.50 కోట్లతో సమస్య పరిష్కారం కాదని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఎన్నో ఖర్చులు చేస్తోందని.. రూ.47 కోట్లు ఇవ్వలేదా? అని న్యాయస్థానం ఏజీని ప్రశ్నించగా.. ప్రభుత్వాన్ని అడిగి రేపు చెబుతామని ఆయన సమాధానమిచ్చారు. ”మీకు ఇబ్బంది ఉంటే చెప్పండి.. సీఎస్‌, ఆర్థికశాఖ కార్యదర్శిని పిలుస్తాం” అని ఏజీని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu