సినిమా రంగం మాత్రమే కాదు, ఏ రంగం లో అయినా పురస్కారాలు ప్రోత్సాహాన్ని అందిస్తాయని, బాధ్యతను మరింత పెంపొందిస్తాయని, అన్ని విధాలుగా రాణించేందుకు దోహదపడతాయని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. సినీ గోయర్స్ 52వ స్వర్ణోత్సవ ఫిలిం అవార్డుల వేడుకలు శుక్రవారం శిల్పకళా వేదిక లో జరిగాయి.
ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె వి రమణాచారి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, దర్శకులు కె.రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, అలనాటి తారలు జయప్రద, విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులకి అవార్డులు అందజేశారు.
ముఖ్యఅతిధిగా విచ్చేసిన గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ సమాజం లో అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన వినోద మాధ్యమం సినిమా అని, బాధ్యతాయుత సినిమాలు నిర్మించాలని కోరారు. దక్షిణాది రాష్ట్రాల్లో టాలీవుడ్ సినిమా కు ప్రత్యేక గుర్తింపు ఉందని, లక్షల మంది సినిమా రంగం లో ఉపాధి పొందుతున్నారని అభినందించారు. సమాజం లో నెలకొన్న పరిస్థితులను అధిగమించేందుకు సినిమా రంగం కృషి చేయాలనీ గవర్నర్ పిలుపునిచ్చారు.