TS Crime: హైదరాబాద్ శివారులోని నార్సింగిలో పోకిరీలు రెచ్చిపోయారు. నార్సింగి పరిధిలోని నెమలి నగర్‌కు చెందిన ఓ యువతి సోమవారం ఉదయం తన ఇంటికి సమీపంలోని దుకాణానికి వెళ్లింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన సురేశ్, అతని గ్యాంగ్ యువతితో అసభ్యంగా ప్రవర్తించారు.
హోలీ రోజు దొరకలేదని ఆమెపై నీళ్లు పోశారు. పోకిరీల అసభ్యప్రవర్తనతో భయపడిపోయిన సదరు యువతి వాళ్ల నుంచి తప్పించుకుని ఏడుస్తూ ఇంటికి వెళ్లింది. దుకాణానికి వెళ్లిన యువతి ఏడుస్తూ రావడంతో ఏమైందని తల్లిదండ్రులు అడగ్గా జరిగిన విషయం చెప్పింది.
దీంతో ఆ పోకిరీల దగ్గరకు వెళ్లి యువతి తండ్రి నిలదీశాడు. ఈ క్రమంలో వాగ్వాదం జరగడంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన సురేశ్ ఫ్రెండ్ ప్రవీణ్.. యువతి తండ్రి గొంతు కోశాడు. అడ్డొచ్చిన తల్లిపైనా కత్తితో దాడి చేశారు. పోకిరీల నుంచి ఎలాగోలా బయటపడ్డ యువతి తల్లిదండ్రులు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సురేశ్, ప్రవీణ్‌తో పాటు ఆరుగుర్ని అరెస్టు చేశారు. వారిపై సెక్షన్ 307, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి 4 కత్తులను స్వాధీనం చేసుకున్నారు.