అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దృష్టి ఓ బాలీవుడ్ చిత్రంపై పడింది. ఈ మేరకు ట్రంప్ సదరు బాలీవుడ్ చిత్రాన్ని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ కూడా పెట్టారు. ‘అంధాధున్’ చిత్రంతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా నటించిన సినిమా ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’. స్వలింగ సంపర్కుల(గే) మధ్య ఉండే ప్రేమాభిమానులను గురించి తెలియజేసే విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి హితేశ్ కేవల్యా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానాతోపాటు జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. శుక్రవారం ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది.
‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ సినిమా విడుదలను తెలియజేస్తూ ఇటీవల స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త పీటర్ టాట్చెల్ ట్విటర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. ‘స్వలింగ సంపర్కుల మధ్య ఉండే ప్రేమాభిమానులను తెలియజేసే విధంగా బాలీవుడ్లో తెరకెక్కిన ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను. అలాగే ఈ సినిమా చూశాక స్వలింగ సంపర్కులపై ఉన్న చిన్నచూపు పోతుందని ఆశిస్తున్నాను’ అని పీటర్ టాట్చెల్ పేర్కొన్నారు. అయితే పీటర్ పెట్టిన ట్వీట్‌పై ట్రంప్ స్పందించారు. పీటర్ ట్వీట్‌కు రీట్వీట్ చేస్తూ.. ‘గ్రేట్’ అని పేర్కొంటూ రిప్లై ఇచ్చారు.
Great! https://t.co/eDf8ltInmH
— Donald J. Trump (@realDonaldTrump) February 21, 2020