లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పొత్తులు, కూటమి ఎత్తులు వంటి పరిణామాలతో రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటే లక్ష్యంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే.. దేశంలో గుణాత్మక మార్పు అంటూ ఫెడరల్ ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇప్పటికే వివిధ ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి చర్చించిన కేసీఆర్ ఇప్పుడు వైసీపీతోనూ చర్చించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వైసీపీ అధినేత జగన్‌తో చర్చలు జరపాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ ఎంపీ వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిలను ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో రేపు ఉదయం కేటీఆర్ బృందం చర్యలు జరపనుంది. జగన్ నివాసంలో మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. రాజకీయంగా తొలిసారి కేటీఆర్.. జగన్‌తో చర్చలు జరపనుండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.