టీఆర్ఎస్ ఎంపీలు తనను కలిసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వారితో సరదాగా సంభాషణ సాగించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అంత పెద్ద మెజారిటీతో గెలిచినా.. తనకు ఒక్క మిఠాయి కూడా తినిపించలేదని టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత జితేందర్ రెడ్డితో అన్నారు. సోమవారం టీఆర్‌ఎస్ ఎంపీలు మోడీని కలిసి తమ పార్టీ కార్యాలయానికి ఢిల్లీలో భూమి కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో మోడీ వారితో ఇలా సరదాగా సంభాషించారు. మంత్రులు, ఎంపీలకు మిఠాయిలు తినిపించి.. నాకు మాత్రం ఇవ్వరా? అని మోడీ అన్నారు. పుల్లారెడ్డి స్వీట్స్ నుంచి ప్రత్యేకంగా తెప్పించి ఇస్తామని టీఆర్‌ఎస్ ఎంపీలు మోడీతో అన్నారు. బెల్లం, కాజుతో చేసే మిఠాయి స్వయంగా వచ్చి ఇస్తానని ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మోడీతో అన్నారు. పార్లమెంట్‌లో తమ పార్టీ నుంచి 17 మంది ఎంపీలు ఉన్నారని, చట్ట ప్రకారం తమ పార్టీ కార్యాలయానికి వెయ్యి చదరపు గజాల స్థలం ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాజేంద్రప్రసాద్ రోడ్డులో ఖాళీ స్థలాన్ని తమ పార్టీ కార్యాలయం నిర్మాణానికి కేటాయించాలని కోరారు.