టీఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. గురువారం సాయంత్రం ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి 17 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేశారు. ముందుగా ఊహించిన ప్రకారమే కేటాయింపులు జరిగినప్పటికీ.. అనేక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేశారు. ఈ జాబితాలో ముగ్గురు సిట్టింగ్‌లకు స్థానం దక్కలేదు. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్థానంలో నామా నాగేశ్వరరావు, మహబూబ్‌నగర్‌లో జితేందర్‌రెడ్డి స్థానంలో మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మహబూబాబాద్‌లో సీతారాం నాయక్ స్థానంలో మాలోతు కవితకు చోటు కల్పించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్కాజ్‌గిరి స్థానం నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్‌కు అవకాశం కల్పించారు. చేవెళ్ల నుంచి పారిశ్రామికవేత్త రంజిత్ రెడ్డిని బరిలో దించుతున్నట్టు ప్రకటించారు. పెద్దపల్లి స్థానం కోసం జి.వివేక్‌కు చివరి వరకు ప్రయత్నం చేసినా ఫలించలేదు. హైదరాబాద్ నుంచి స్నేహపూర్వక పోటీలో భాగంగా నామమాత్రంగా అభ్యర్థిని పోటీలో నిలిపారు. నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డిని నిలబెట్టాలని తొలుత నిర్ణయించినప్పటికీ.. ఆయన మంత్రి పదవి కావాలని కోరారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. మల్కాజ్‌గిరి టిక్కెట్‌ను ఆశించిన నవీన్‌రావుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే, టీడీపీని వీడి గురువారం కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన నామా నాగేశ్వరరావుకు ఖమ్మం టిక్కెట్‌ను ఖరారు చేశారు. అభ్యర్థులకు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో బీఫారాలను పంపిణీ చేశారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా ఇదే..
ఆదిలాబాద్ : జి.నగేశ్
నిజామాబాద్ : కవిత
కరీంనగర్ : బి. వినోద్ కుమార్
పెద్దపల్లి : ఎన్. వెంకటేశ్
మెదక్ : కొత్త ప్రభాకర్ రెడ్డి
జహీరాబాద్ : బీబీ పాటిల్
మల్కాజ్‌గిరి : మర్రి రాజశేఖర్ రెడ్డి
చేవెళ్ల : రంజిత్ రెడ్డి
హైదరాబాద్ : పుస్తె శ్రీకాంత్ రెడ్డి
సికింద్రాబాద్ : తలసాని సాయికిరణ్
నాగర్‌కర్నూలు : పి. రాములు
వరంగల్ : పసునూరి దయాకర్
మహబూబ్‌నగర్ : మన్నె శ్రీనివాస్ రెడ్డి
మహబూబాబాద్ : మాలోతు కవిత
ఖమ్మం: నామా నాగేశ్వరరావు
నల్గొండ : వేంరెడ్డి నర్సింహారెడ్డి
భువనగిరి : బూర నర్సయ్యగౌడ్