తెలంగాణలో స్థిరపడిన ఏపీ ప్రజలకు అండగా ఉంటామని టీఆర్‌ఎస్ నేత, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఏపీ అభివృద్ధికి తాము అడ్డుపడుతున్నామంటూ టీడీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీకి వెళ్తున్నారని, భవిష్యత్‌లో అక్కడ కూడా రాజకీయాలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. అక్కడ అవినీతి
పెరిగిపోయిందని, ప్రచార ఆర్భాటమే ఎక్కువగా కనిపిస్తోంది విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ తాను పర్యటిస్తానని తలసాని చెప్పారు. కులాల మధ్య చిచ్చుపెట్టింది చంద్రబాబేనని ఆయన దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
కేంద్రంలో భాజపా, కాంగ్రెసేతర ప్రభుత్వమే లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని.. చంద్రబాబు లేకున్నా అభివృద్ధి సాధ్యమవుతుందని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరూపించిందని చెప్పారు. బంధాలు, బంధుత్వాల గురించి చంద్రబాబుకు ఏం తెలుసని తలసాని వ్యాఖ్యానించారు.