Trivikram Allu Arjun Movie: బాహుబలి సినిమా తర్వాత చిన్న డైరెక్టర్లు కూడా ప్యాన్ ఇండియా రేంజ్ సినిమాలు తీయడానికి ముందుకు వస్తున్నారు. దాదాపు స్టార్ హీరోలు అందరూ ప్యాన్ ఇండియా రేంజ్ లోనే సినిమాలు తీస్తున్నారు. కానీ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఇంకా ఇలాంటి సినిమాల జోలికి రావడం లేదు.
ఇంతకుముందు త్రివిక్రమ్ మహేష్ బాబుతో చేస్తున్న గుంటూరు కారం సినిమా కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ విడుదల కి ముందే చిత్ర బృందం ఈ పుకార్లకు చెక్ పెట్టింది. అయితే సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంత భారీ స్థాయి కలెక్షన్లు నమోదు చేసుకోలేకపోయింది.
ఇంకా ఎన్నాళ్లు త్రివిక్రమ్ ప్యాన్ ఇండియా సినిమాలకి దూరంగా ఉంటారు అని అందరూ అనుకుంటున్న సమయంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఓకే అయింది. 2021 లో విడుదలైన పుష్ప సినిమాతోనే బన్నీ రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. టాలీవుడ్ లో మాత్రమే కాక నార్త్ లో కూడా ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది.
ఇక పుష్ప 2 సినిమా కూడా భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కి సిద్ధం అవుతుంది. ఇకపై బన్నీ కూడా ప్యాన్ ఇండియా సినిమాలు మాత్రమే తీస్తారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. మిగతా భాషల్లో ఉన్న అల్లు అర్జున్ అభిమానుల కోసం కూడా ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాలు తీయాల్సిన అవసరం ఉంది.
అందుకే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కోసం ప్యాన్ ఇండియా కి మారాల్సిన అవసరం వచ్చి పడింది. అంతా బాగానే ఉంది కానీ కొంతమంది అభిమానులు మాత్రం త్రివిక్రమ్ ప్యాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించగలిగే సినిమాలు తీయగలరా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్ ని తెలుగులో మాటలు మాంత్రికుడు అని అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు.
డైలాగ్స్ లో, వన్ లైనర్లు, కౌంటర్లు, వంటి వాటితో కామెడీ జనరేట్ చేయగల డైరెక్టర్లలో త్రివిక్రమ్ ని తలదన్నే వాళ్ళు లేరు. కానీ త్రివిక్రమ్ రైటింగ్ కి తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయినంత బాగా మిగతా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
మరి త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారో లేదో వేచి చూడాలి. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ అట్లీతో చేయాల్సిన సినిమా ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి త్రివిక్రమ్ సినిమా మీదే దృష్టి పెట్టనున్నారు.