కరోనా మహమ్మారిని అరికట్టడానికి భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్ పాటించాలంటూ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. జనతా కర్ఫ్యూకు ఇప్పటికే అన్ని రాష్ట్రాలు మద్దతు ప్రకటించాయి. రేపు ఆదివారం ప్రజారవాణా కూడా స్తంభించనుంది. దేశవ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి.. ఇప్పటికే పలు రాష్ట్రాలు దీనిపై ప్రకటనలు చేశాయి. మరోవైపు రైల్వే శాఖ కూడా ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే ఇవాళ్టి నుంచే రైల్వే సర్వీసులను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తిరిగే 250 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, ఈ రోజు అర్ధరాత్రి నుంచి రేపు రాత్రి 10 గంటల వరకూ పూర్తిగా రద్దు చేస్తున్నట్టు సీపీఆర్వో రాకేష్ ఓ ప్రకటనలో తెలిపారు. రేపటి జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులు సహకరించాలని కోరారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో తిరిగే సబర్బన్ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తం 121 ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండగా.. వాటిలో 109 సర్వీసులను రద్దు చేస్తామని.. రేపు కేవలం 12 ఎంఎంటీఎస్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు.