ఆర్మీలో మహిళల పట్ట వివక్షకు స్వస్తి చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. పురుషులతో పోలిస్తే మహిళలు శారీరకంగా బలహీనంగా ఉంటారని, సామాజిక కట్టుబాట్లు వీటన్నిటి రీత్యా వారు ఆర్మీలో కమాండర్ పోస్టులకు అర్హులు కారన్న కేంద్ర ప్రభుత్వ ‘మూస ధోరణి’పై జస్టిస్ వై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా అధికారులు కేవలం పురుష అధికారుల సహాయకులుగా నియమించే కాలంలో మనం లేమని, అన్ని పదవులకు వారు అర్హులేనంటూ జస్టిస్ డివై చంద్రచూడ్, హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వచ్చే మూడు నెలల్లో ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు చేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పురుష అధికారులతో సమానంగా మహిళా అధికారులు అర్హులు కాదని పేర్కొనడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని తెలిపింది. ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ కల్పిస్తూ 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.