HomeTelugu Big StoriesTollywood Star Heroes In Theaters Business: స్టార్‌ హీరోల కొత్త దందా.. మహేష్‌ - ప్రభాస్‌ అందరూ అదే రూట్‌లో..

Tollywood Star Heroes In Theaters Business: స్టార్‌ హీరోల కొత్త దందా.. మహేష్‌ – ప్రభాస్‌ అందరూ అదే రూట్‌లో..

Tollywood Star Heroes In Theaters BusinessTollywood Star Heroes In Theaters Business: సినిమా హీరోలకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు, వారిని నమ్మే కోట్లు పెడుతున్నారు నిర్మాతలు. వారిని నమ్మే కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు దర్శకులు. ఇలా ప్రతిదీ వారి బేస్‌గానే నడుస్తుంది. ఆడియెన్స్ కూడా చాలా వరకు హీరోలను చూసే సినిమాకి వస్తుంటారు.

ప్రస్తుతం హీరోలు కేవలం నటనకే పరిమితం కావడంలేదు. ఇతర రంగాల్లోనూ రాణిస్తున్నారు. చాలా కాలంగా హీరోలు నిర్మాతలుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ నుంచి ఈ ట్రెండ్‌ కొనసాగుతూనే ఉంది. మధ్యలో కొంత బ్రేక్‌ వచ్చినా మళ్లీ ఇప్పుడు చాలా మంది స్టార్‌ హీరోలు ప్రొడక్షన్‌లో భాగమవుతున్నారు. మహేష్‌ బాబు ప్రొడ్యూసర్‌గా మారి చాలా సినిమాలు నిర్మించారు. అలాగే చిరంజీవికి ప్రొడక్షన్‌ ఉంది. అల్లు అర్జున్‌కి హోం బ్యానర్‌ ఉంది. ప్రభాస్‌ కి యూవీ ఉంది. రవితేజ ఈ మధ్యనే స్టార్ట్ చేశాడు. వెంకటేష్‌కి హోం బ్యానర్‌ ఉంది.

అయితే ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు కొత్త దందా మొదలు పెట్టారు. ఒకప్పుడు హీరోలు, నిర్మాతలు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు వెర్వేరుగా ఉండేవారు. కానీ ఇప్పుడు హీరోలు కూడా ఎగ్జిబిటర్లుగా మారుతున్నారు. థియేటర్లు నిర్మిస్తూ నెమ్మదిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లని తమ వశం చేసుకుంటున్నారు. మున్ముందు తమ సినిమాలను వారి థియేటర్లలోనే విడుదల చేసేందుకు వాటిని రెడీ చేస్తున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్లన్నీ ఆ నలుగురి చేతుల్లోనే ఉన్నాయని, తమకు థియేటర్లు ఇవ్వడం లేదని చిన్న నిర్మాతలు వాపోయేవారు. ఎక్కువగా థియేటర్లు దిల్‌రాజు, అల్లు అరవింద్‌, సురేష్‌ బాబు, ఏసియన్‌ నిర్మాతల వద్ద ఉండేవి. కానీ ఇప్పుడు నెమ్మదిగా హీరోలు ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. థియేటర్లని మల్టీఫ్లెక్స్‌ చేస్తున్నారు. హీరోలు థియేటర్‌ రంగంలోకి వస్తున్నారు. కాగా వీరందరికి ఒక్కరే థియేటర్‌ పార్టనర్‌ కావడం విశేషం.

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు మొదటగా థియేటర్‌ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన కొండాపూర్‌లోని శరత్‌ సిటీ మాల్‌లో మల్టీప్లెక్స్ నిర్మించారు. ప్రముఖ డిస్ట్రిబిటర్‌, నిర్మాత ఏషియన్‌ పార్టనర్‌గా మహేష్‌ బాబు థియేటర్‌ బిజినెస్‌ స్టార్ట్ చేశారు. వారితో కలిసి ఏఎంబీ(ఏషియన్‌ మహేష్‌ బాబు) మల్టీప్లెక్స్ నిర్మించారు.

ఇది మన ఇండియాలోనే అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన థియేటర్‌ కావడం విశేషం. దీనికి ప్రస్తుతం విశేషంగా డిమాండ్‌ ఉంది. ఏ క్లాస్‌ ఆడియెన్స్ ఈ థియేటర్‌కు క్యూ కడుతున్నారు. అంతేకాదు బెంగుళూరులో కూడా ఓ థియేటర్‌ నిర్మిస్తున్నారు మహేష్‌ బాబు.

మహేష్‌ తరువాత అల్లు అర్జున్‌ ఈ థియేటర్‌ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన అమీర్‌ పేటలోని సత్యం థియేటర్ స్థానంలో నిర్మించిన మాల్‌లో ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి `ఏషియన్‌ అల్లు అర్జున్‌`(ఏఏఏ)ని నిర్మించారు. ప్రస్తుతం ఇది కూడా బాగా నడుస్తుంది. ఇది కూడా అత్యధునిక టెక్నాలజీతో, అత్యాధునిక సదుపాయాలతో నిర్మించడం విశేషం. దీంతోపాటు నెమ్మదిగా మరికొన్ని థియేటర్లు కూడా మాడిఫికేషన్‌లో ఆయన భాగం అయ్యేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నారట.

విజయ్‌ దేవరకొండ కూడా థియేటర్‌ రంగంలో ఉన్నాడు. ఆయన తన సొంత జిల్లా అయిన మహబూబ్‌ నగర్‌లో ఏషియన్‌ వాళ్లతోనే కలిసి `ఏవీడీ`(ఏషియన్‌ విజయ్‌ దేవరకొండ) పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించారు. ఇది కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం రన్నింగ్‌లో ఉంది. మరికొన్ని మల్టీప్లెక్స్ ల్లో ఆయన భాగం కాబోతున్నారు.

ప్రభాస్‌ కూడా దందాలో ఉన్నారు. ఆయన తన హోం బ్యానర్‌ అయినటువంటి యూవీ క్రియేషన్స్ పేరుతో థియేటర్‌ నిర్మించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో దేశంలోనే అతిపెద్ద స్క్రీన్‌ తో కూడిన మల్టీప్లెక్స్ ని నిర్మించారు. వీ సెల్యూలాయిడ్‌ పేరుతో దీన్ని నిర్మించారు.

ఇక ఇటీవలే రవితేజ ఈ రంగం వైపు అడుగులు వేస్తున్నాడు. ఆయన బ్యాక్ టూ బ్యాక్‌ రెండుమూడు థియేటర్లలో భాగం కాబోతున్నట్లు తెలుస్తుంది. దిల్‌సుఖ్‌ నగర్‌లో వెంకటాద్రి థియేటర్‌ స్థానంలో మల్టీఫ్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇందులో ఏషియన్‌ వాళ్లతో కలిసి ఏషియన్‌ రవితేజ(ఏఆర్‌టీ) పేరుతో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. మరోవైపు వనస్థలిపురంలో కొత్తగా ఓ మాల్‌ నిర్మిస్తున్నారు. అందులో మల్టీప్లెక్స్ కూడా ఏషియన్‌తో కలిసి ఏఆర్‌టీ థియేటర్‌ నిర్మిస్తున్నారు రవితేజ. మరికొన్నింటిలో ఆయన భాగం కానున్నారు.

ఇదిలా ఉంటే.. వెంకటేష్‌ కూడా ఈ మల్టీప్లెక్స్ వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే అన్న సురేష్‌ బాబుకి చాలా థియేటర్లు ఉన్నాయి. కానీ మల్టీప్లెక్స్ లు లేవు. వెంకీ ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు ఏషియన్‌ సినిమాస్‌ వాళ్లతోనే కలిసి మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నారు. ఆర్‌టీసీ ఎక్స్ రోడ్‌లో సుదర్శన్‌ థియేటర్‌ చాలా ఫేమస్‌. దాన్ని కూల్చీ ఆస్థానంలో మల్టీ ప్లెక్స్ నిర్మించబోతున్నారు.

అయితే మహేష్‌ బాబు, వెంకీ, ఏసియన్‌ వాళ్లు కలిసి ఏఎంబీ విక్టరీ పేరుతో దీన్ని నిర్మించనున్నారట. ఇలా హీరోలంతా థియేటర్‌ రంగంలోకి వస్తూ నెమ్మదిగా మల్టీప్లెక్స్ లను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. వాళ్లే ఎగ్జిబిటర్లు గా మారబోతున్నారు. ఒకేసారి మూడు నాలుగు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్‌ అయినప్పుడు ఎవరి థియేటర్లో వాళ్లు తమ సినిమాలను ప్రదర్శించుకునే పరిస్థితి వస్తుందేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu