కరోనా వైరస్ బాధితులకు సహాయం చేసేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకొచ్చారు. వారి స్థాయికి తగ్గట్టుగా విరాళాలు ఇస్తున్నారు. ముందుగా హీరో నితిన్ రూ. 2 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తరువాత ఒక్కొక్కరుగా తమ వంతు సాయం అందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. కరోనా బాధితుల కోసం ముఖ్యమంత్రుల సహాయనిధితో పాటు ప్రధాన మంత్రి నిధికి కూడా ఈ కోటిని విరాళంగా ఇచ్చాడు మెగాస్టార్. ఇండస్ట్రీలో ఉన్న రోజువారీ కూలీలకు, అలాగే తక్కువ సంపాదన ఉన్న వాళ్లకు తన వంతు సాయంగా ఈ చిన్న సాయం చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు చిరంజీవి. కరోనా కట్టడికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలపై చిరు ప్రశంసలు కురిపించాడు. దయచేసి అంతా ఇంట్లోనే ఉండి ఈ 21 రోజుల యుద్ధంలో గెలుద్దామని ట్వీట్ చేశాడు చిరు.
అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భారీగానే విరాళం అందించాడు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఏకంగా కోటి రూపాయల విరాళం అందించి ..సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్నాడు. కరోనా మహమ్మారిని అరికట్టడానికి రెండు రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న చర్యలపై ప్రశంసల వర్షం కురిపించాడు మహేష్ బాబు. ఓ బాధ్యత గల వ్యక్తిగా ఇంట్లోంచి ఎవరూ కాలు బయట పెట్టొద్దని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కోరాడు మహేష్
బాబు. అందరూ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాలని.. 21 రోజులు ఇంట్లోనే ఉండాలని కోరాడు సూపర్ స్టార్. అందరూ లాక్ డౌన్ నిబంధనలు పాటిద్దాం.. మానవత్వం గెలుస్తుంది.. కచ్చితంగా ఈ యుద్ధంలో మనం విజయం సాధిస్తామని మహేష్‌బాబు వెల్లడించాడు. మనకు మనమే రక్షణగా ఉండాల్సిన సమయం వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పటికే పవన్ కల్యాణ్, రామ్ చరణ్, వీవీ వినాయక్, త్రివిక్రమ్ విరాళలు ప్రకటించారు.