Mahesh To Ram Charan: సౌత్ నుంచి నార్త్ వరకు యాక్షన్ సినిమాల హవా నడుస్తోంది. చాలామంది స్టార్లు పవర్‌ఫుల్ ఫైట్స్ చేయడానికే ఇష్టపడుతున్నారు. ఫైట్ సీన్స్‌లో పవర్ చూపించడానికి కొందరు ఖాకీ డ్రెస్ వేస్తున్నారు. పోలీస్ క్యారెక్టర్స్‌తో సత్తా చూపిస్తున్నారు. నాలుగు సింహాలుగా బాక్సాఫీసు మీద విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే కొందరు స్టార్లు లాటీ పట్టుకుంటే మరికొందరు సంఘవిద్రోహ శక్తుల పని పట్టడానికి రెడీ అవుతున్నారు. స్టార్‌లో ఎంతగా హీరోయిజం చూపిస్తే అంతగా ఆడియన్స్‌కు దగ్గరవుతారు. మాస్ ఆడియన్స్ మనసులు గెలుచుకుంటారు. దీంతోనే లాంగ్ కెరీర్‌కు ఆస్కారం ఉంటుంది. చెడు మీద మంచి గెలుస్తుంటే ప్రేక్షకులు కూడా ఫుల్ ఖుషీ అవుతుంటారు. అందుకే ఫుల్ పవర్స్ చేతిలో ఉండే పోలీసు ఆఫీసర్లుగా అవతారమెత్తుతున్నారు మన హీరోలు.
కుర్ర హీరోలు కూడా ఖాకీ డ్రెస్ వేసుకుని సమరానికి సై అన్నారు. మాస్ హీరోగా మారిపోవడానికి ఇదే సరైన మార్గం అని నమ్ముతున్నారు. దేనికైనా కాన్సెప్ట్ ముఖ్యం. స్టోరీ బాగుంటేనే సినిమా హిట్ అవుతుంది. ఖాకీ తొడుక్కున్నంత మాత్రానే హిట్ దొరుకుతుంది అని చెప్పలేం. ఖాకీ డ్రెస్ వేసుకునే ఖలేజా కూడా ఆ హీరోకి ఉండాలి.
ఇస్మార్ట్ శంకర్ మూవీతో హిట్ కొట్టాడు పోతినేని రామ్. మాస్ ఆడియన్స్ వద్ద మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ది వారియర్ మూవీలో కనిపించాడు. మాస్ డైరెక్టర్ లింగుస్వామి ఈ సినిమాకు డైరెక్టర్. అయితే ఈ మూవీ మాత్రం విజయం సాధించలేకపోయింది. SR కళ్యాణమండపంతో కిరణ్ అబ్బవరం విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో ఫైట్స్ బాగానే చేసి మాస్ ఆడియన్స్ దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత మీటర్ అనే సినిమాతో వచ్చాడు. అందులో స్థాయికి మించి యాక్షన్ చేశాడు. పోలీస్ పాత్రలో కనిపించి మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గర కావాలని అనుకున్నాడు. కానీ కిరణ్ ఐడియా బెడిసి కొట్టింది. మీటర్‌లో చార్జ్ ఎక్కువ అవడంతో పగిలిపోయింది.
చెడుపై మంచి చేసే పోరాటానికి సపోర్ట్ ఉంటుంది. అందుకే ఫుల్ పవర్స్ చేతిలో ఉన్న పాత్రలో అభిమాన హీరో కనిపిస్తే థియేటర్లలో సందడి వేరే లెవల్లో ఉంటుంది. కలెక్షన్లు కూడా బాగానే రాలతాయి. అందుకే యువ హీరోలు పోలీస్ పాత్రల్లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆశయం ఒక్కటి.. సాధించాల్సింది మరొక్కటి. అందుకోసం కరుడుగట్టిన పోలీసుగా మారి మనసును రాయి చేసుకుని డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది.. ట్రిపుల్ ఆర్‌లో రామ్‌చరణ్ పాత్రలా ఉంటుంది. ఇందులో పవర్ పోలీస్‌గా కనిపించాడు చరణ్. అప్పుడప్పుడు నెగెటివ్ షేడ్స్ ఈ పాత్రలో కనిపిస్తుూ ఉంటాయి. ఆ పాత్ర అలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలిశాక ఆడియన్స్ ఆ క్యారెక్టర్‌కు బాగా కనెక్ట్ అవుతారు. ఆ పాత్రకు జేజేలు పలుకుతారు.
హిట్ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందింది. ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా విశ్వక్‌సేన్ నటించాడు. సినిమా విజయం సాధించింది. సెకండ్ పార్ట్‌లో అడివిశేష్ హీరోగా నటిస్తే, మూడో పార్ట్‌లో నాని ఖాకీ డ్రెస్‌లో మెరవబోతున్నాడు. మరికొందరు స్టార్లు కూడా హిట్ ప్రాంఛైజీలోకి రాబోతున్నారు.
టాలీవుడ్ నెంబర్‌వన్ పొజిషన్‌కు వెళ్లిన హీరోలు కూడా లాఠీ పట్టుకుని రంగంలోకి దిగిన వారే. ఆడియన్స్‌కు ఈ క్యారెక్టర్లతో మరింత దగ్గరైన వారే. పోకిరి సినిమాలో కృష్ణమనోహర్ ఐపీఎస్‌గా కనిపించి ఆడియన్స్‌కు గిఫ్ట్ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేష్. అలాగే దూకుడు మూవీతో పాటు, ఆగడులో ఇదే పాత్రలో నటించాడు. ఇక పోలీస్ క్యారెక్టర్ వేయడంలో నేనేం తక్కువనా అని ముందుకు దూకాడు జూనియర్ ఎన్టీఆర్. శక్తి, టెంపర్ మూవీలలో పోలీస్ క్యారెక్టర్లలో కనిపించాడు.
ఇప్పటి స్టార్లే కాదు.. అప్పటి సీనియర్ హీరోలు కూడా పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్లుగా ఒకటి కంటే ఎక్కువసార్లే కనిపించారు. పోలీసు పాత్రలో నటించి ఆడియన్స్ మెప్పు పొందారు. స్టార్ స్టేటస్ అందుకున్నారు. వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్ వరకు పోలీస్ డైలాగ్స్ చెప్పిన వారే. రౌడీలను, గూండాలను సెల్‌లో వేసి కుమ్మిన వాళ్లే. ఖాకీ డ్రెస్ వేసుకుని యాక్షన్ చేసి ఆకట్టుకున్నవారే. ఫిలిం ఇండస్ట్రీలో ఎందరో స్టార్లు. అందులో కొందరు ఖాకీ డ్రెస్ తొడిగి అదరగొట్టారు.
విక్రమార్కుడిగా పోలీస్ పవర్ చూపించాడు మాస్ మహరాజ్ రవితేజ. భయమన్నదే లేని దమ్మున్నోడుగా కనిపించాడు. ఇక చాలాకాలం హిట్‌లు లేని రవితేజకు పోలీస్ పాత్రలే హిట్ ట్రాక్ మీదకు తెచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ట్రాక్ మూవీతో సాలిడ్ విజయం అందుకున్నాడు.
అన్ని భాషల హీరోలు పోలీసు పాత్రలు వేసేందుకు ఇష్టపడుతున్నారు. లాఠీ పట్టుకుంటున్నారు, అవసరమైతే తుపాకీ పేల్చడానికి సిద్ధమంటున్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడే క్యారెక్టర్లకు సై అంటున్నారు. చిన్నహీరో, పెద్ద హీరో అని తేడా లేకుండా ఆ క్యారెక్టర్స్‌లో కనిపిస్తున్నారు. పెద్ద హీరోలకైతే ఈ పోలీస్ క్యారెక్టర్లు బాగానే కలిసి వస్తున్నాయి.
ఖాఖా సినిమాతో ఖాకీ డ్రెస్ తొడిగాడు సూర్య. దర్శకుడు హరి ఈ క్యారెక్టర్‌తో నే సూర్యను కోలీవుడ్ సింగంగా మార్చేశాడు. ఆ రేంజ్‌లో సింగం టైటిల్‌తో వచ్చిన మూవీ భారీ విజయాన్ని సాధించింది. సూర్య డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ పాత్రలో ఇరగదీశాడు. ఇదే సినిమా 3 పార్ట్‌లుగా రిలీజైంది. ఈ 3 పార్ట్స్ కూడా బిగ్ హిట్ కొట్టాయి. సూర్య తమ్ముడు కార్తి కూడా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయననటించిన ఖాకీ మూవీ అటు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో కార్తి పోలీస్ పాత్రలో కనిపించాడు. కోలీవుడ్‌లో మాస్ ఆడియన్స్‌లో బాగా పాపులర్ అయిన హీరో దళపతి విజయ్. ఫుల్‌గా అభిమానులను సంపాదించుకున్నాడు. విజయ్ కూడా పలు సినిమాల్లో పోలీసు పాత్రల్లో కనిపించాడు.
పోలీస్ స్టోరీలను ప్రేక్షకులు ఆదరించడంతో స్టార్లు ఈ పాత్రల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఖాకీ డ్రెస్ వేసుకుని కథ బాగుంటే వెంటనే ఆ క్యారెక్టర్‌లోకి దూరిపోతున్నారు. అంతేకాదు ఒక భాషలో మూవీ హిట్ అయితే మరో లాంగ్వేజ్‌లో మేకర్స్ గద్దల్లా తన్నుకుపోతున్నారు. అక్కడా రీమేక్ చేస్తున్నారు.
కోలీవుడ్‌లో సింగం సిరీస్ హిట్ కొట్టడంతో ఇదే సినిమా అజయ్‌దేవ్‌గన్ హీరోగా హిందీలో రీమేక్ అయింది. అజయ్ దేవగన్‌కు అక్కడి నేటివిటీకి తగ్గట్టుగా మార్పులుచేసి సినిమాను రీమేక్ చేశారు. అక్కడ కూడా భారీ విజయం సాధించింది. రోహిత్ శెట్టి ఈసినిమాను డైరెక్ట్ చేశాడు. అంతేకాదు మరో సౌత్ పోలీస్ మూవీ కూడా రోహిత్ శెట్టి హిందీలోకి రీమేక్ చేశాడు. తెలుగులో ఎన్టీఆర్ నటించిన టెంపర్ తమిళంలో అయోగ్యగా రీమేక్ అయింది. విశాల్ హీరోగా నటించాడు. రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించింది. ఇదే సినిమా బాలీవుడ్‌లో శింబా పేరుతో రీమేక్ అయింది. రణవీర్‌సింగ్ హీరోగా నటించాడు. ఈమూవీ బిగ్ హిట్ కొట్టింది. అలాగే అక్షయ్ కుమార్ హీరోగా సూర్యవంశీ మూవీని రోహిత్ శెట్టి తెరకెక్కించాడు.