టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ విచారణకు హాజరయ్యాడు. దాదాపు తొమ్మిదిన్నర గంటల పాటు ఆయన ఈడీ కార్యాలయంలోనే ఉన్నాడు. అయితే కేవలం మూడు గంటలు మాత్రమే అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. బ్యాంక్ లావాదేవీల పైనే దృష్టి సారించిన ఈడీ.. విదేశీ లావాదేవీలపై ఆరా తీశారు. పూరీకి సంబంధించిన మూడు బ్యాంక్ ఖాతాల స్టేట్‌మెంట్స్‌ను పరిశీలించారు. ఇవన్నీ వాంగ్మూలం రూపంలో నమోదు చేసుకున్న ఈడీ అధికారులు.. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని పూరీకి చెప్పి పంపారు.
ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఈడీ కార్యాలయానికి వెళ్లడంతో ఆయనపై మీడియాలో పలు కథనాలు వచ్చాయి. పూరీ విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఈడీ అధికారులు బండ్ల గణేశ్‌కు సమన్లు జారీ చేశారని వార్తలు వినిపించాయి. అయితే ‘అమ్మతోడు.. నాకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. కనీసం వక్కపొడి కూడా వేసుకోని నన్ను ఈడీ వాళ్లు ఎందుకు పిలుస్తారు. పూరీగారు ఇక్కడికి ఉదయం వచ్చారు. ఇంతసేపు కావడంతో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి నా అంతట నేనే వచ్చా..’ అని గణేష్ వివరణ ఇచ్చారు.