టాలీవుడ్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపద్యంలో మరో విషాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కెఎఫ్సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన నిర్మాత కమలాకర్‌రెడ్డితో పాటు ఆయన తండ్రి నందగోపాల్‌రెడ్డి (75) మృతి చెందారు. ఇటీవల కమలాకర్‌రెడ్డి తండ్రి నందగోపాల్‌రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయనతో కాంటాక్ట్‌లో ఉన్న నిర్మాత కమలాకర్‌రెడ్డికి కూడా కరోనా వచ్చింది. నెల్లూరు సమీపంలోని ఓ గ్రామంలో ఉంటున్న వీరిద్దరు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు అంబులెన్స్‌లో వస్తుండగా, నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఆగివున్న లారీని అంబులెన్స్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కమలాకర్‌రెడ్డితో పాటు ఆయన తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తండ్రికుమారులు ఇద్దరూ మృత్యువాత పడటడంతో వారి కుటుంబం విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇటీవల విడుదలైన ‘కనులు కనులు దోచాయంటే’ సినిమాను కేఎఫ్‌సీ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమాకు కమలాకర్‌రెడ్డి కో ప్రోడ్యూసర్‌గా వ్యవహరించారు. అంతేగాక తెలుగు బ్లాక్‌బస్టర్ చిత్రాలు ‘అర్జున్‌రెడ్డి’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలను పంపిణీ చేశారు. పలు తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్ సినిమాలను కూడా ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు.