భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తుంటే కొందరు ఆకతాయిల కారణంగా ఆ సినిమాలు పైరసీ పాలవుతున్నాయి. పైరసీ చేయడంలో కొత్త కొత్త టెక్నాలజీలు వినియోగించడంతో దీన్ని అరికట్టడం ఇబ్బందిగా మారుతోంది. ఇప్పటికే చాలా సినిమాలు పైరసీ దాడికి గురయ్యాయి. తాజాగా ఓ బాలీవుడ్ సినిమా కూడా పైరసీ సమస్యను ఎదుర్కొంటుంది. సినిమా విడుదలకు ముందే సెకండ్ హాఫ్ మొత్తం లీక్ అవ్వడం చూసి నిర్మాతలు షాక్ కు గురయ్యారు. స్వచ్చ్ భారత్ కాన్సెప్ట్ ను ప్రమోట్ చేస్తూ.. తెరకెక్కిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ అనే బాలీవుడ్ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం లీకైంది.
అక్షయ్ కుమార్, భూమి పద్నేకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇంట్లో మరుగుదొడ్డి ఆవశ్యకతను ఓ ప్రేమ కథ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు నారాయణ్ సింగ్. ఇంట్లో మరుగుదొడ్డి లేని కారణంగా మహిళలు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనే సమస్యలపై ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్ట్ 15న సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించారు. అయితే విడుదలకు ముందే సినిమా లీకై పెన్ డ్రైవ్స్, సీడీల రూపంలో చక్కర్లు కొడుతోంది. దీంతో దర్శకనిర్మాతలకు కంటి మీద కునుకులేకుండా ఉంటున్నారు.