Tirupati Gangamma Jatara: తిరుపతి గ్రామ దేవత గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా సంబరం జరుగుతోంది. హిందూ పురాణాల ప్రకారం, వెంకన్న చెల్లెమ్మ గంగమ్మ. ప్రతి ఏటా తిరుపతి గ్రామ దేవత గంగమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తారు. ఏడు రోజుల పాటు రోజుకో వేషంలో గ్రామ దేవతకు భక్తులందరు ప్రత్యేక పూజలు చేస్తూ.. గ్రామదేవతకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.
మొన్నటి వరకూ ఎన్నికల ప్రచారాలతో మోతెక్కిన తిరుపతి నగర విధులు.. ఈ రోజు నుంచి ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో జరిగే ప్రముఖ జాతరల్లో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతీ ఏటా మే నెలలో ఏడు రోజుల పాటు జాతర నిర్వహించటం జరుగుతుంది. నిన్న అర్థరాత్రి చాటింపుతో తిరుపతి గ్రామ దేవతగా పిలుచుకొనే చిన్నగంగమ్మ జాతర ప్రారంభమైంది. దీని కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
గంగమ్మ జాతర ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. తిరుపతి కార్పొరేషన్ కమిషనర్‌తోపాటు డీఆర్వోను సమన్వయం చేసుకుని ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా జాతర సందర్భంగా శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. జాతర ముగింపు రోజు భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
నేటి నుంచి ఈనెల 21వ తేదీ వరకు ఏడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. 22వ తేదీన తెల్లవారు జామున అమ్మవారి విశ్వరూప దర్శనం, చెంప నరికే కార్యక్రమంతో జాతర ముగియనుంది. ఈ సందర్భంగా గంగమ్మ జాతర విశిష్టత గురించి తెలుసుకుందాం…
గంగమ్మ జాతరను తిరుపతి పొలిమేరలోని అవిలాల నుంచి కైకాల కుల పెద్దల చాటింపుతో గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతరలో భాగంగా ఉదయం అమ్మవారి విశ్వరూప స్థూపానికి పసుపు, కొబ్బరి నీళ్లు, పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారిని పసుపుతో అలంకరించి భక్తులు సమర్పించిన చీరలు, వడిబాలు కడతారు. అనంతరం రాత్రి 7 గంటలకు గంగమ్మ తల్లి పుట్టినిల్లుగా భావించే అవిలాల గ్రామం నుంచి పుట్టింటి సారె, కుంకుమ, కొత్త బట్టలను గ్రామ పెద్దలు తీసుకొస్తారు. వీటిని ఆలయం తరపున కైకాల వంశస్తులు అందుకుంటారు. ఈ సారెను ఆలయానికి ఊరేగింపుగా తీసుకొస్తారు.
తిరుపతి గ్రామ దేవత గంగమ్మ జాతర జరిగే వారం రోజుల పాటు గ్రామస్తులు పొలిమేర దాటరు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాత్రుళ్లు ఇక్కడే ఉండకుండా బయటికి వెళ్లిపోవడం ఇక్కడి ఆనవాయితీ. ఈ తాతయ్య గుంట గంగమ్మ జాతరకు దాదాపు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామ దేవతగా అవతరించిన గంగమ్మను.. సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న చెల్లెలిగా భావించి ఆరాధిస్తారు.
ముందుగా భైరాగి వేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. మే 16న బండ వేషం, మే 17న తోటి వేషం, 18న దొర వేషం, 19న మాతంగి వేషం, 20న సున్నపు కుండలు, 21న గంగమ్మకు చప్పర కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం 22న విశ్వరూప దర్శనం తర్వాత చెంప నరికే కార్యక్రమంతో జాతర ముగుస్తుంది.
ఈ జాతర సమయంలో మగాళ్లు చీర ధరించి మొక్కులు తీర్చుకుంటారు. ఇలా వారం రోజుల పాటు విచిత్ర వేషధారణతో అమ్మవారిని దర్శించుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయడం వల్ల అమ్మవారు తమ కోరికలు తీరుస్తుందని భక్తులు నమ్ముతారు. వందల ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. గంగమ్మ తల్లికి టీటీడీ నుంచి కూడా సారె అందుతుంది. ఈ ఏడాది కూడా భక్తులు జాతరను చూసేందుకు భారీగా వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతరకు తగిన ఏర్పాట్లు చేశారు.