డిసెంబరు 25, 26 తేదీల్లో రెండు రోజుల్లో కలిపి 13 గంటలపాటు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. డిసెంబరు 26న ఉదయం 8.08 నుంచి 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. క్షేత్ర సంప్రదాయం ప్రకారం 6 గంటల ముందు అంటే 25న బుధవారం రాత్రి 11 గంటలకు ప్రధానాలయం తలుపులు మూసివేస్తారు. 26, 27 తేదీల్లో ప్రత్యేక దర్శనం కోటా పెంచారు. ప్రతి నెలా రెండు రోజులపాటు వృద్ధులు, చంటిపిల్లలున్న తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం కోటాను పెంచి అమలుచేస్తున్న టీటీడీ ఈ నెలలో 26, 27 తేదీల్లో ఈ అవకాశం కల్పించింది. 26న 65 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు 4 వేల టోకెన్లను మూడు స్లాట్‌లతో ఇవ్వనుంది. 27న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య ఐదేళ్లలోపు పిల్లలతో సహా తల్లిదండ్రులు ఆధార్‌కార్డుతో వస్తే నేరుగా సుపథం నుంచి ప్రధానాలయానికి అనుమతిస్తారు.