కొద్ది రోజులుగా టిక్ టాక్ చేయడం వల్ల తెలుగురాష్ట్రాల్లోనే కొందరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. టిక్‌టాక్ తమ ఉద్యోగాలకు ఎసరు పెడుతుందని పలువురు వాపోతున్నారు. ఉద్యోగులు ఆఫీస్ సమయంలో పనులను పక్కన పెట్టి టిక్ టాక్ వీడియోలతో కాలక్షేపం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పలు రాష్ట్రాలు ఇప్పటికే ఈ సోషల్ మీడియా యాప్ లపై దృష్టిపెట్టింది. వందలాదిమంది నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో.. టిక్ టాక్ పై చర్యలు తీసుకోవడానికి రాష్ట్రాలు సిద్ధం అవుతున్నాయి.
దేశంలోని దాదాపు 7 రాష్ట్రాలు టిక్ టాక్ ను బ్యాన్ చేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు ఈ యాప్ ను బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నాయి. కేంద్రం కూడా ఆయా యాప్ సంస్థలకు 24 ప్రశ్నలతో కూడిన నోటీసులను జారీ చేసింది. వాటికి సరైన సమాధానం ఇవ్వకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉంటె, టిక్ టాక్, హలో యాప్ లు ఇండియాలో వందకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి.