చలనచిత్ర పరిశ్రమకు పైరసీ భూతం పెద్ద సమస్యగా మారింది. ఇకపై సినిమాకి చెందిన సంబంధిత వ్యక్తుల అనుమతులు లేకుండా సినిమాను కాపీ చేయాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా సినిమాటోగ్రఫీ 1952 సవరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ప్రకారం సరైన అనుమతులు లేకుండా పైరసీ చర్యలకు పాల్పడిన వ్యక్తులు మూడేళ్ల కారాగార శిక్ష లేదా పది లక్షల రూపాయల జరిమానా కట్టాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఆ రెండిటికీ శిక్షార్హులవుతారు. కేంద్రప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఈ సవరణ బిల్లు గురించి సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందిస్తూ తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. ‘మన దేశంలోని మేధావుల సంపత్తిని కాపాడుకోవడంలో ఇది ముఖ్యమైన ముందడుగు’ అని ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ ప్రెసిడెంట్ సిద్ధార్థ్‌రాయ్ కపూర్ అన్నారు.