మెదక్ జిల్లా పాపన్నపేట (మ) పొడ్చన్‌పల్లిలో ప్రమాదవశాత్తు మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. పంట పొలాల్లో నీటికోసం 120 అడుగుల వరకు బోరు వేసినా నీరు రాకపోవడంతో అలాగే వదిలేశారు. బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరు బావిలో పడటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని అధికారులు బాలుడిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బోరుబావిలోకి పైపు ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. బోరు బావికి సమాంతరంగా జేసీబీలతో తవ్వుతున్నారు. నీటికోసం పొలంలో నిన్న 3 బోరుబావులు తవ్వగా నీరు రాకపోవడంతో రెండు బావులను పూడ్చేశారు. మూడో బావి వేసిన కొద్ది సేపటిలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరం. బోరు బావి తవ్వించింది బాలుడి తాత భిక్షపతిగా అధికారులు తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బోరుబావి ఘటనలు ఎన్నో జరుగుతున్నా తల్లిదండ్రులు అప్రమత్తంగా లేకపోవడంపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. బాలుడు 30 అడుగుల లోతులో ఉన్నట్టు కలెక్టర్ వెల్లడించారు.