దేశంలో లాక్‌డౌన్ మరో 19 రోజుల పాటు పొడిగించడంతో పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు రోడ్డెక్కారు. స్వస్థలాలకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ముంబైలోని బాంద్రా స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముంబైలో ఉన్న పలురాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు భారీ సంఖ్యలో కాలినడకనే సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు వారిని అడ్డుకుని బాంద్రా పీఎస్‌కు తరలించారు. భారీ సంఖ్యలో వచ్చిన వలస కార్మికులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో వలస కూలీలు, కార్మికులను పోలీసులు లాఠీలతో చెదరగొట్టారు. తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. వలసకూలీలంతా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.
ఓవైపు ముంబైలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే వేలాది మంది క్వారంటైన్‌లో ఉన్నారు. ధారావి వంటి స్లమ్ ఏరియాల్లో పూర్తిగా లాక్‌డౌన్ అమలుచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేలాదిగా కార్మికులు ఒకేచోటకు చేరుకోవడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. వారిని చెదరగొట్టే ప్రయత్నంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే 21 రోజులపాటు పనులు లేకుండా ఉన్నామని, ఇంకా ఎన్నిరోజులు ఉండాలంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లాక్‌డౌన్ ఉన్నా కాలినడకన సొంతూళ్లకు వెళ్తామంటూ నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు కేంద్ర విధానాలే కారణమని అన్నారు. వలస కార్మికుల గురించి ప్రధాని మోదీ ఎలాంటి ప్రకటన చేయలేదని అందువల్లే వారిలో ఆందోళన నెలకొందని అన్నారు. కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.