ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయం మీద ప్రజలకు పెద్దగా ఆసక్తి ఉన్నట్లు కనిపించడం లేదు. రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి ? అంటూ మీడియా సంస్థలు మాత్రం నిత్యం ఏదో ఒక టాపిక్ లేవనెత్తుతూ గోల చేస్తున్నాయి. ఇందులో భాగంగా జనసేన టీడీపీతో కలవడం లేదు అంటూ కొత్తగా ప్రచారం మొదలుపెట్టారు. అసలు ఏ పార్టీ పరిస్థితి ఏమిటో ? ఏది దేనితో కలుస్తుందో ? ఏది ఒంటరో, ఏది తుంటరో ? అన్న విషయాల గురించి మీడియా ఎందుకు ఇంత మధన పడుతోందో ?.. మీడియాకే తెలియాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గురించి తెగ బాధ పడుతున్న ఈ మీడియా ఆఫీసులు అన్ని హైదరాబాద్ లో ఉండటం ఒక విచిత్రమైన విషయం అనుకోండి.
తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఉహించి చెబుతూ మీడియా సంస్థలు అన్నీ కాలక్షేపం చేస్తున్నాయి. వాస్తవ పరిస్థుతుల పై అవగాహన లేకుండా కొన్ని మీడియా సంస్థలు అనేక కల్పిత కథనాలను ప్రసారం చేస్తూ వస్తున్నాయి. 2024 ఎన్నికలకు అయితే ఇంకా 20 నెలలు సమయం ఉంది. ఆ ఎన్నికల గురించి ఇప్పుడే చెప్పడం అంటే.. మబ్బులు చూసి కుండలో నీళ్లు ఒలకబోసుకున్నట్లు ఉంటుంది. సరే.. 2024 లో లేదా ఇంకా ముందుగా ఎన్నికల ప్రకటన వచ్చాక, పార్టీలు ఎలా పోటీ చేస్తాయో చూద్దాం.
జగన్ రెడ్డి ఒంటరిగా వెళ్తాడు, కొందరు అలవాటు ప్రకారం ఆయన్ను వదిలేసి టీడీపీ, బీజేపీలోకి వెళ్తారు. కొందరు వస్తారు ఇది మాములేగా పెద్ద ఊహాశక్తి పనిలేదు. జనసేన, బీజేపీ లు కలిసి పోటీ చేస్తాయి, బహుశా పవన్ ను బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించవచ్చు, పవన్ కూడా ఇక బీజేపీ తోనే దోస్తీ.. నాకు ఇక వేరే ఏ ఆలోచన లేదు అని ప్రకటన చేసి.. కొన్ని ఆర్ధిక సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఐతే, అసలుకే బీజేపీ పై ఆంధ్రాలో భారీ వ్యతిరేఖత ఉంది. కాబట్టి, పవన్ ఈ సారి కూడా ఓడిపోవచ్చు. అదే టీడీపీతో కలిసి వెళ్తే.. కనీసం పవన్ కళ్యాణ్ అయినా గెలిచే ఛాన్స్ ఉంది.
ఇక ముఖ్యమైన విషయం టీడీపీ. టీడీపీ ఒంటరిగానే వెళ్ళింది అనుకుందాం. ఏమవుతుంది ?. కొన్ని చాణక్య ఎత్తులు వేసి బాబు పొత్తు లేకుండా బలం పెంచుకుంటూ వెళ్తే.. కచ్చితంగా టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ.. రావాలి అంటే.. టీడీపీలో కొన్ని మార్పులు చేర్పులు జరగాలి. భవిష్యత్తు సీఎం లోకేష్ బాబే అనే నినాదాన్ని పూర్తిగా వదిలేయాలి. గంటా లాంటి స్వార్ధపరులను పక్కన పెట్టాలి. ఉమా లాంటి పబ్లిసిటీ నాయకులను దగ్గరకు తీసుకోకూడదు.
అన్నిటికీ మించి పార్టీలో యువతకు అవకాశాలు కల్పించాలి. ఇక అతి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే.. జూనియర్ ఎన్టీఆర్ ను తిరిగి పార్టీలో సగర్వంగా ఆహ్వానించాలి. టాలెంట్ ఉన్న వారికే పట్టం అనే ఆలోచనను తెలుగు యువతలో కలిగించాలి. అపుడు టీడీపీ గెలిచి తీరుతుంది. ఎక్కడ అయితే అవకాశాలు మెండుగా ఉంటాయో.. అక్కడికే యువత వెళ్తుంది. బాబు ఈ పాయింట్ ను దృష్టిలో పెట్టుకోవాలి.