కన్నడ స్టార్ యశ్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బహిరంగంగా హెచ్చరించారు. తమలాంటి నిర్మాతల వల్ల అలాంటి నటులు జీవిస్తున్నారని అభిప్రాయపడ్డారు. దివంగత ఎంపీ అంబరీష్ సతీమణి సుమలత మండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడతో ఆమె పోటీకి దిగారు. సుమలతకు యశ్ మద్దతుగా ఉన్నారు. ఇటీవల నామినేషన్ వేయడానికి సుమలత వెళ్లినప్పుడు ఆయన కూడా ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో కుమారస్వామి తాజాగా జరిగిన సభలో యశ్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘మాలాంటి నిర్మాతలు లేకపోతే ఈ నటుల జీవితం ముందుకెళ్లదు. యశ్ లాంటి నటులు నా పార్టీ సభ్యుల్ని విమర్శిస్తున్నారు. నా కారణంగా కార్యకర్తలు కామెంట్ చేయకుండా మౌనంగా ఉన్నారు. ఇలాంటి నటులతో సినిమాలు తీసేందుకు ఇక నేను ఒప్పుకుంటానన్న నమ్మకం నాకు లేదు. మాలాంటి నిర్మాతలు ఉండటం వల్ల వాళ్లు జీవించగలుగుతున్నారు. వెండితెరపై చూసే ప్రతి విషయాన్ని నమ్మకండి (ప్రజల్ని ఉద్దేశిస్తూ). రోజూ మీరు చూసే సంఘటనలే నిజాలు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఈ నటులు ఎక్కడికి పోయారు?’ అని కుమారస్వామి ప్రశ్నించారు.