ఆగస్ట్ రెండో వారంలో వస్తోన్న లాంగ్ వీకెండ్ సెలవులను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో ఆగస్ట్ 11న మొత్తం మూడు సినిమాలను బరిలోకి దింపుతున్నారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాను ఆగస్ట్ 11న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అలానే బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న ‘జయ జానకి నాయక’ సినిమా కూడా అదే రోజు రాబోతుంది. దీంతో ఆదేరోజు రావాలనుకున్న నితిన్ ‘లై’ సినిమా ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఇప్పటికే ‘ఫిదా’ సినిమా తన జోరుని కొనసాగిస్తోంది. ఈ శుక్రవారం ‘గౌతమ్ నంద’ థియేటర్లోకి రాబోతుంది. ఆ వచ్చే వారం ఆగస్ట్ 4న మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
దీంతో థియేటర్ల పరంగా కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది మాత్రం నితిన్ ‘లై’ సినిమా అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో చిత్రీకరిస్తున్నారు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో థియేటర్లు అవసరం ఉంటుంది. అలానే ఎక్కువ మల్టీప్లెక్స్ షోలు కూడా వేయాలి. లేదంటే పెట్టిన పెట్టుబడి తిరిగిరాదు. కానీ ఇన్ని సినిమాలు ఒకేసారి రావడం వలన థియేటర్లు ఎక్కువ సంఖ్యలో దొరకడం కష్టం. మిగిలిన సినిమాల బడ్జెట్ ప్రకారం.. తక్కువ థియేటర్లలో విడుదలైనా.. వర్కవుట్ అవుతుందట. కానీ నితిన్ సినిమాకు మాత్రం కాస్త స్పేస్ ఉండాలని చెబుతున్నారు. మరి నితిన్ అనుకున్నరోజే వచ్చేస్తాడా..? లేదంటే రాజీ పడి కొంత గ్యాప్ తరువాత విడుదల చేస్తాడా..? అనేది తెలియాల్సివుంది!