గుజరాత్‌లోని నర్మద జిల్లాలో సర్దార్ సరోవర్ ఆనకట్ట వద్ద ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధుడు, సంస్థానాల విలీనకర్త సర్దార్ వల్లభాయ్ పటేల్ 182 మీటర్ల ఎత్తైన విగ్రహాన్నిబుధవారం ప్రధాని మోడీ బుధవారం ఆవిష్కరించనున్నారు. “ఏక్తా విగ్రహం” పేరుతో అక్టోబర్ 31న పటేల్ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు. అప్పుడు మూడు ఫైటర్ జెట్లు అతితక్కువ ఎత్తులో ఎగురుతాయి. విగ్రహావిష్కరణ తర్వాత పటేల్‌కు మోదీ నివాళి అర్పిస్తారు.
అమెరికాలోని “స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ” కన్నా రెండింతలు పెద్దదైన ఈ విగ్రహ ఆవిష్కరణ తర్వాత మూడు ఐఏఎఫ్ విమానాలు దానిమీద నుంచి ఎగురుతూ ఆకాశంలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులను వెదజల్లనున్నాయి. ఆ వెంటనే “ఏక్తా గోడ”(వాల్ ఆఫ్ యూనిటి)ను మోడీ ఆవిష్కరిస్తారు. అదే సమయంలో రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు విగ్రహంపై పూల వాన కురిపిస్తాయి. ఇది ముగిసిన వెంటనే పుష్పాల లోయను ప్రారంభించి పటేల్ మ్యూజియాన్ని ప్రధాని జాతికి అంకితం చేస్తారు.
ఏక్తా విగ్రహ నిర్మాణం కోసం 70,000 టన్నుల సిమెంటు, 18,500 టన్నుల పోతపోసిన స్టీలు, 60,000 టన్నుల సాధారణ స్టీలు, 1700 మెట్రిక్ టన్నుల రాగిని ఉపయోగించారు. 29 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని కళాకారులు ఇక్కడ నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. గుజరాత్ పోలీసులు, పారామిలటరీ బలగాలు బ్యాండ్ ప్రదర్శన చేయనున్నాయి. ఈ విగ్రహ నిర్మాణంతో వెలకట్టలేని ప్రకృతి సంపద నాశనమైందని అక్కడి గ్రామాలకు చెందిన 22 మంది సర్పంచులు మోదీ రాకను వ్యతిరేకిస్తున్నారు. ఓ బహిరంగ లేఖను రాశారు. ఇప్పటికీ అక్కడ పాఠశాలలు, తాగునీరు, ఆస్పత్రులు లేవని అందులో పేర్కొన్నారు.